పాడి రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. అరిగోస పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అటు ప్రభుత్వ సంస్థ మదర్ డెయిరీ, ఇటు స్వతంత్ర బాడీ మదర్ డెయిరీలో పాల బిల్లులు వస్తలేవు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి. ఇప్పటికే దాణా ధరలు పెరిగి రైతులు ఆపసోపాలు పడుతుండగా, బిల్లులు రాకపోవడంతో ఇంకింత పరేషాన్ అవుతున్నారు. నార్ముల్ నుంచి బకాయిలు రాకపోవడంతో రైతులు పాలను బయట ప్రైవేట్‌లో అమ్ముకుంటున్న దుస్థితి నెలకొంది. ఫలితంగా రోజురోజుకు సంస్థ పరిస్థితి దిగజారిపోతున్నదనే
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– యాదాద్రి భువనగిరి, మార్చి 25 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో రైతులు అధికంగా పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అధిక శాతం మంది మదర్ డెయిరీకి పాలను అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 24 పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. 435 పాల సొసైటీల్లో 32 వేల మంది వరకు సభ్యులు ఉన్నారు. రోజూ సుమారు 50వేల లీటర్లకు పైనే పాలను విక్రయిస్తున్నారు. రైతుల వెన్న శాతాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. పాడి రైతులకు 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కొంత కాలంగా డబ్బులు సకాలంలో బ్యాంకుల్లో జమ కావడంలేదు. ఇటీవల నెలకు ఒక్క బిల్లు ఇచ్చి.. మరొకటి పెండింగ్‌లో పెడుతున్నారు. ఇలా ప్రస్తుతం 5 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో బిల్లు సుమారు రూ. 5 కోట్ల వరకు ఉంటుంది. అంటే రూ. 25 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది.
మదర్ డెయిరీ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్‌టైంలో డబ్బులు రాకపోవడంతో కొంత మంది బయట అప్పులు చేయాల్సి వస్తున్నది. మరోవైపు రుణాలతో గేదెలను కొన్న రైతులు ఈఎంఐలు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దాణా ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు మదర్ డెయిరీకి పాలు పోయడం మానేస్తున్నారు. బయట వేరే సంస్థలు ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తుండటంతో వారికే విక్రయిస్తున్నారు. ఫలితంగా మదర్ డెయిరీకి పాల కొరత ఏర్పడుతున్నది. దీంతో బయట గుజరాత్, కర్నాటక రాష్ర్టాల నుంచి మదర్ డెయిరీ పాలను కొంటూ కాలం వెల్లదీస్తున్నట్లు తెలుస్తున్నది. కమీషన్ల కోసం బయట వేరే సంస్థల నుంచి పాలు కొనేందుకు డెయిరీ పాలక వర్గం ఆసక్తి చూపిస్తున్నదని సొసైటీల సభ్యులు ఆరోపిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మదర్ డెయిరీ పాలక వర్గం వ్యవహరిస్తున్నది. సొసైటీ సభ్యులు, ఉద్యోగులు చీదరించుకుంటున్నారు. పాలు అమ్మే దగ్గర, కొనే దగ్గర కమీషన్ కోసం కక్కుర్తి పడుతున్నారు. గుజరాత్, కర్నాటక నుంచి పాలు కొంటూ.. లీటరుకు రూ. 2 కమీషన్ తీసుకుంటున్నారు. పాడి రైతులకు మాత్రం బిల్లులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. రైతులకు చెల్లించే డబ్బులతోనే బయట పాలను కొనుగోలు చేస్తూ.. వారికి అన్యాయం చేస్తున్నారు. ఎప్పటిప్పుడు బిల్లులు చెల్లించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తం.
– దొంతిరి సోమిరెడ్డి, మదర్ డెయిరీ మాజీ డైరెక్టర్
ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీకి జిల్లాలో 2,500 మంది వరకు పాలను విక్రయిస్తుంటారు. పాల నాణ్యతను బట్టి ధరలను నిర్ణయిస్తారు. గతంలో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేది. ఇటీవల డబ్బుల చెల్లింపుల్లో జాప్యం జరుగుత్నుది. జిల్లాలో సుమారు నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పాల ఉత్పత్తిదారులకు రూ. కోటికి పైగా బాకీ ఉంది. ఒక్కో రైతుకు సగటున నెలకు రూ. 20 నుంచి రూ. 50వేల వరకు బకాయిలు ఉన్నాయి. బడ్జెట్ లేకపోవడంతో ఆలస్యం అవుతున్నదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థల్లో విజయ పాలు, ఇతర ఉత్పత్తులు వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయా సంస్థలు స్పందించి వెనువెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేను మదర్ డెయిరీలో రోజూ 10 లీటర్ల పాలు పోస్తాను. ఇప్పటి వరకు నాలుగు పాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పాల బిల్లులు ఎప్పటికప్పుడు వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో బకాయిలు లేకుండా ఇచ్చేవారు. ప్రస్తుతం బిల్లులు బకాయిలు ఉండడంతో పశువులకు దాణా, గడ్డి సక్రమంగా పెట్టలేకపోతున్నాం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా పాలకవర్గం పెండింగ్ బిల్లులు చెల్లించి రైతులను ఆదుకోవాలి.
-సామల శ్రీకాంత్, పాడి రైతు, (ఆలేరు రూరల్)
మదర్ డెయిరీ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. ఇప్పటివరకు రైతులకు ఐదు బిల్లులు బకాయి పడ్డది. ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే బిల్లు మూడు నెలలుగా ఇవ్వడం లేదు. బిల్లులు రాక పాడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పాల బిల్లుల రాక బయట అప్పులు తెచ్చి నడిపిస్తున్నారు. ఇప్పటికే మదర్ డెయిరీపై నమ్మకం కోల్పోయిన సగం మంది పాడి రైతులు ప్రైవేట్ డెయిరీలో పాలు పోస్తున్నారు. పాల సొసైటీ చైర్మన్‌గా ఉన్నందున మేము సంఘంలో పాడి రైతుల ముందు పరపతి కోల్పోయాం. బిల్లులు చెల్లించకపోతే మదర్ డెయిరీ ఆఫీసులకు రైతులు తాళం పెట్టే అవకాశాలు ఉన్నాయి.
-సంధిల భాసర్గౌడ్, రాజాపేట పాల సొసైటీ చైర్మన్