సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్17: బడా బాబుల భూములు కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి, పేద రైతుల భూములు గుంజుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ వారు బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం వద్ద చౌటుప్పల్ -నారాయణపురం వెళ్లే రహదారిపై బైఠాయించి రాస్తారోకు చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతు కన్నీళ్లు పెడితే దేశానికి మంచిది కాదని, ప్రభుత్వం స్పందించి పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మా ణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదని తెల్చి చెప్పారు. దాదాపు గంట సేపు రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై వారికి నచ్చజెప్పి రాకపోకలు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో రైతులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.