నకిరేకల్ ప్రగతి పరుగుల్
స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తుండగా, దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. కేవలం నాలుగేండ్లలోనే నియోజకవర్గవ్యాప్తంగా రూ.717కోట్లకుపైగా అభివృద్ధి పనులు జరుగడం విశేషం.
- స్వరాష్ట్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషితో మారుతున్న రూపురేఖలు
- బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు రూ.150 కోట్లు
- నకిరేకల్ దవాఖాన 100 పడకలకు అప్‌గ్రేడ్
- రూ.100 కోట్లతో అయిటిపాముల లిఫ్ట్
- మన ఊరు – మన బడిలో 87 పాఠశాలల పునరుద్ధరణ
- సుందరంగా నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీలు
- అన్ని గ్రామాలకు రహదారులు
- పల్లెపల్లెనా ప్రగతి శోభ.. గడపగడపకూ సంక్షేమ ఫలాలు
స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తుండగా, దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. కేవలం నాలుగేండ్లలోనే నియోజకవర్గవ్యాప్తంగా రూ.717కోట్లకుపైగా అభివృద్ధి పనులు జరుగడం విశేషం. లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్న బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు రూ.150 కోట్లు విడుదల కాగా, టన్నెల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల్లో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అయిటిపాముల లిఫ్ట్‌కు రూ.100 కోట్లు మంజూరయ్యాయి. మిషన్ కాకతీయతో పునరుద్ధరణకు నోచిన చెరువులు, పెద్దఎత్తున నిర్మాణం పూర్తిచేసుకున్న చెక్‌డ్యామ్‌లతో వేసవిలోనూ జలకళ ఉట్టిపడుతున్నది. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల భూ సేకరణ నిధులకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నకిరేకల్ 30 పడకల కమ్యూనిటీ దవాఖాన రూ.32కోట్లతో 100 పడకలు ఆస్పత్రిగా మారుతున్నది. రూ.4.50 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెయిన్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు, సమీకృత మార్కెట్ నిర్మాణంతో మెరుగైన వసతులు సమకూరుతున్నాయి. చిట్యాల మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి.మరోవైపు గ్రామగ్రామానికీ అద్దంలాంటి రోడ్లు ఏర్పాటయ్యాయి. గల్లీల్లోనూ సీసీ రోడ్లు సౌకర్యంగా మారాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పంచాయతీలు, మున్సిపాలిటీలు స్వచ్ఛతకు కేరాఫ్‌గా కనిపిస్తున్నాయి. మరోవైపు అభివృద్ధితో పోటీ పడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు ఆసరా అవుతుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నారు. ఎమ్మెల్యే చొరవతో అభివృద్ధి పనుల కోసం నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.717 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. మున్సిపాలిటీలుగా ఏర్పడిన నకిరేకల్,చిట్యాల పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సమస్యలు పరిష్కారమై సకల వసతులు సమకూరాయి. పల్లెలు ప్రగతికి చిరునామాలుగా నిలుస్తున్నాయి. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిట్యాల మున్సిపాలిటీలో 20కోట్ల పనులు..
చిట్యాల మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేట్టారు. అందులో 70 శాతం పనులు పూర్తి కావచ్చాయి. మరికొన్ని ప్రగతిలో ఉన్నాయి. రూ.5 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ, రెండు కమ్యూనిటీ హాళ్లు, రూ.1.20కోట్లతో వైకుంఠధామం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల భూసేకరణకు నిధులు..
పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల భూసేకరణ కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ను ఇటీవల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిసి భూసేకరణ కోసం పెండింగ్ బిల్లులతోపాటు కొత్తగా భూసేకరణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. గతంలో సేకరించిన 137 ఎకరాల కోసం పెండింగ్ నిధులు రూ.2.32 కోట్లు, కొత్తగా 47 ఎకరాల భూసేకరణ కోసం మరో రూ.4.84 కోట్లు ఏప్రిల్ మొదటి వారంలో మంజూరు చేస్తానని, పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
100 కోట్లతో అయిటిపాముల లిఫ్ట్
ఎమ్మెల్యే చిరుమర్తి చొరవతో 3 మండలాల్లోని 11 గ్రామాల రైతులకు ప్రయోజనం కలిగేలా కట్టంగూర్ మండలం అయిటిపాముల రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఇది పూర్తయితే కట్టంగూర్, నకిరేకల్, శాలిగౌరారం మండలాల్లోని 11 గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి.
శరవేగంగా నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి
కొత్తగా ఏర్పడిన నకిరేకల్ మున్సిపాలిటీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషితో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. నకిరేకల్ పట్టణంలోని హైవే పైనున్న పద్మానగర్ జంక్షన్ నుంచి ఇనుపాముల జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.26 కోట్లు మంజూరయ్యాయి. ఆ డబ్బుతో రోడ్డుకు ఇరువైపులా 6 ఫీట్ల వెడల్పుతో డ్రైనేజీని నిర్మిస్తున్నారు. 50 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లకు పెంచి రోడ్డు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. రెండో విడుతలో తిప్పర్తి, మార్కెట్ రోడ్ల విస్తరణ కోసం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వందేండ్ల చరిత్ర ఉన్న కాలంవారికుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధికి రూ.4.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. తొలి విడుతలో రూ.75 లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బుతో కట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు. మిగిలిన నిధులు మంజూరు కాగానే కట్టపై హైమాస్ట్ లైట్లు, పార్కు, కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో రూ.2 కోట్లతో సకల సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మిస్తున్నారు. ఇందులో కూరగాయలు, చేపలు, కోళ్లు, మేక, గొర్రె మాంసం అందుబాటులో ఉంటాయి. మార్కెట్ పనులు చకచకా సాగుతుండగా.. 6 నెలల్లో అందుబాటులోకి రానుంది. రూ.4.50 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం చేపడుతున్నారు.
100 పడకల దవాఖాన
రాష్ట్ర ప్రభుత్వం నకిరేకల్ మున్సిపాలిటీలోని 30 పడకల ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసింది. దీనికోసం రూ.32 కోట్లు మంజూరు చేయగా.. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి అంతస్తులో బ్లాక్-ఏలో డయాలసిస్, లాండ్రీ విభాగం, బ్లాక్-బీలో ఓపీ సెక్షన్, బ్లాక్-సీలో లేబర్ కాంప్లెక్స్, బ్లాక్-డీలో ఎమర్జెన్సీ విభాగాలుంటాయి. రెండో అంతస్తులో బ్లాక్-ఏ2లో ఓటీ కాంప్లెక్స్, బ్లాక్-బీ2లో ఎస్ఎన్సీయూ కాంప్లెక్స్, బ్లాక్-సీ2లో జనరల్ వార్డులు, బ్లాక్-డీ2లో పే రూమ్స్, వార్డులు ఉంటాయి. మాతా శిశువులకు సంబంధించి ప్రత్యేక సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర విభాగం(ఐసీయూ)లో గర్భిణులకు డెలివరీ చేయనున్నారు.
నకిరేకల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతా
నాలుగేండ్ల కాలంలో నియోజకవర్గంలో వందలాది కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరలోనే పూర్తవుతాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరవేయడమే లక్ష్యం. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు నకిరేకల్‌లో రూ.32 కోట్లతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100 కోట్లతో చేపట్టే లిఫ్ట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఉదయ సముద్రం ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం ఇప్పటికే రూ.200 కోట్లు కేటాయించారు. మరికొన్ని నిధులు మంజూరు చేయించి మిగతా పనులను త్వరగా పూర్తి చేస్తాం. నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లతోపాటు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణ పనులు కొన్ని పూర్తి కాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల పనులను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి ప్రజల ముందుకొస్తాం. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి ఆదర్శంగా నిలుపుతా.
– చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే
ముమ్మరంగా బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ పనులు
నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా రూ.150 కోట్లు మంజూరు చేసింది. సొరంగ మార్గం, టన్నెల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొద్దిగా మిగిలి ఉన్న కంపోజ్‌ను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన 240 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. నార్కట్‌పల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామంలో 72, బ్రాహ్మణ వెల్లెంలలో 150, ఔరవాణి గ్రామంలో 80 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నియోజకవర్గంలో 87 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వాటి అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి.
గడపగడపకూ సంక్షేమ ఫలాలు
- రైతుబంధు పథకం కింద నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇప్పటి వరకు 87వేల మంది రైతులకు రూ.105 కోట్ల పెట్టుబడి సాయం అందింది.
- నకిరేకల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 860 మంది రైతులు మృతిచెందగా.. రైతుబీమా కింద వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.43 కోట్ల ఇన్సూరెన్స్ అందింది.
- దళితబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుతగా నియోజకవర్గంలో వంద మందికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.10కోట్ల ఆర్థిక సాయం అందించింది.
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా నియోజకవర్గంలో 6,680 మంది లబ్ధిదారులకు రూ.7కోట్లు అందాయి.
- ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2019 నుంచి 2023 వరకు 4,876 మందికి రూ.23కోట్ల ఆర్థిక సాయం అందజేశారు.
- ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయిన 12,110 మందికి కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించారు.
- నియోజకవర్గంలో గొర్లకాపరులకు రూ.4కోట్లతో 270 గొర్రెల యూనిట్లను అందజేశారు.
- మత్స్య కార్మికులకు 6కోట్ల రూపాయల విలువైన 5కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసి వారికి ఉపాధి కల్పించారు.
- నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 43వేల మంది లబ్ధిదారులకు నెలనెలా ఆసరా పింఛన్లు అందిస్తున్నారు.
రహదారులకు నిధుల వెల్లువ
- నకిరేకల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఆయా శాఖల నుంచి రూ.80కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తికాగా.. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. కొన్నింటి పనులు త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- రూ.1.17కోట్లతో ఎన్‌హెచ్ 65 నుంచి కాసనగోడు వరకు రోడ్డు మరమ్మతులు పూర్తయ్యాయి.
- రూ.68.50లక్షలతో చెరుకుపల్లి భీమారం వయా తుంగతుర్తి రోడ్డు మరమ్మతులు చేపట్టారు.
- నకిరేకల్ – మూసీ రోడ్డు మరమ్మతులకు రూ.1కోటి మంజూరు చేయగా.. పనులు జరుగుతున్నాయి.
- నక్కలపల్లి – తొండ్లాయి వయా సబ్బిడిగూడెం రోడ్డుకు రూ.1.55కోట్లు మంజూరయ్యాయి.
- షాపల్లి – పరడ నుంచి గడ్డమీదిబాయి వయా వెంకటేశ్వర్లబాయి వరకు రూ.1.20కోట్లు
- ఔరవాణి – ఎన్‌హెచ్ 65 నుంచి వయా కొండపాకగూడెం, ఎనుగులదొరి, గోపలాయిపల్లి రోడ్డుకు రూ.5.73 కోట్లు
- ఆరెగూడెం నేరడ వయా ఉరుమడ్ల రోడ్డుకు రూ.4.44 కోట్లు
- బ్రాహ్మణ వెల్లెంల నుంచి మొగిలిదొరి వయా ఎలికట్టె, వెంబాయి రోడ్డుకు రూ.5.31 కోట్లు
- నార్కట్‌పల్లి – మాండ్ర వయా చౌటబాయి రోడ్డుకు రూ.82.50లక్షలు
- గుండ్రాంపల్లి పేరెపల్లి వయా ఏపూరు రోడ్డు మరమ్మతులకు రూ.1.19కోట్లు
- గుండ్రాంపల్లి – వెల్లంకి వయా సుంకనపల్లి రోడ్డు మరమ్మతులకు రూ.1.43 కోట్లు
- నోముల – గుడివాడ రోడ్డు మరమ్మతులకు రూ.32లక్షలు
- సుంకెనపల్లి – జైకేసారం రోడ్డు మరమ్మతులకు రూ.11లక్షలు
- చిట్యాల – భువనగిరి రోడ్డు నుంచి జైకేసారం వయా సిరిపురం – వెల్లంకి రోడ్డు మరమ్మతులకు రూ.4.15కోట్లు
- రామన్నపేట-అమ్మనబోలు నుంచి లక్ష్మాపురం రోడ్డు మరమ్మతులకు రూ.3.30కోట్లు
- జాతీయ రహదారి 65 గుండ్రాంపల్లి నుంచి పేరెపల్లి వయా ఏపూరు రోడ్డు మరమ్మతులకు రూ.1.84కోట్లు
- ఎన్‌హెచ్ 65 నుంచి వనిపాకల వయా వట్టిమర్తి రోడ్డు మరమ్మతులకు 1.16 కోట్లు
- కల్మెర – శాపెల్లి రోడ్డు మరమ్మతులకు రూ.1.50కోట్లు
- రామన్నపేట-ఇప్పర్తి రోడ్డు మరమ్మతులకు రూ.1.50కోట్లు
- కట్టంగూర్-ఈదులూరు రోడ్డు (ఈదులూరులో సీసీ రోడ్డు నిర్మాణానికి) రూ.1.52కోట్లు
- ఎన్‌హెచ్ 65 నుంచి నార్కట్‌పల్లి పట్టణంలో రోడ్డు మరమ్మతులకు రూ.83లక్షలు
- నకిరేకల్ – తిప్పర్తి రోడ్డు మరమ్మతులకు రూ.66లక్షలు
- చిట్యాల – మునుగోడు రోడ్డుపై ఉరుమడ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.80లక్షలు మంజూరయ్యాయి.
నియోజకవర్గంలో ప్రగతి పనులు..
- నియోజకవర్గంలో రూ.19 కోట్లతో పల్లె ప్రకృతి వనాలు. రూ.5కోట్లతో 11 బృహత్ పల్లె ప్రకృతి వనాలు. రూ.5కోట్లతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
- నకిరేకల్ నియోజకవర్గంలో రూ.5కోట్లతో 23 రైతు వేదికలను నిర్మించారు.
- గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు నియోజకవర్గం పరిధిలో 7 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల, అమ్మనబోలు, నార్కట్‌పల్లి, తొండ్లాయి, షాపల్లి, ఏపీ లింగోటం, కేతేపల్లి మండలంలోని గుడివాడ, భీమారం, కొప్పోలు, చిట్యాల మండలంలోని వెంకటాపురం, వట్టిమర్తి, చిట్యాల సబ్ సెంటర్లకు రూ.20లక్షల చొప్పున 1.40కోట్లు మంజూరు చేసింది.
- నకిరేకల్ మండలం మంగళపల్లి, కట్టంగూర్ మండలం మల్లారం గ్రామాల్లో పాలేరు వాగుపై రూ.6.82 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. అవి ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి.
- 18 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసింది. పలు చోట్ల పనులు జరుగుతున్నాయి.
చెక్‌డ్యామ్‌లతో నీళ్ల బాధ తప్పింది
నాడు తాగు, సాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డం. వాగులో వర్షపు నీరు వృథాగా పోవడంతో బోరుబావుల్లో నీరులేక పొలాలు ఎండిపోయేవి. రైతులు ఇబ్బందులు పడుతున్నా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మల్లారం పెద్ద వాగుపై రెండు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. దీంతో వర్షపు నీరు వృథా కాకుండా నిల్వ ఉండడంతో భూగర్భజలాలు పెరిగి బోరుబావులు పుష్కలంగా పోస్తున్నాయి. కరంట్ కూడా ఫుల్లుగా ఉండడంతో పంటలు కళకళలాడుతున్నాయి. రైతుల కష్టాలు తీర్చిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – దాసరి సైదులు, రైతు, మల్లారం, కట్టంగూర్ మండలం
బిడ్డ పెండ్లికి అయిన ఖర్చులు కల్యాణలక్ష్మితో తీరినయ్
ఈ మధ్యే నా కూతురి పెండ్లి చేసిన. మా పేదోళ్లకు అండగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం పెట్టారని తెలుసుకున్న. బిడ్డ పెండ్లి అయిపోగానే దరఖాస్తు చేసుకున్న. పైసా ఖర్చు లేకుండా నెల రోజుల్లోనే కల్యాణలక్ష్మి చెక్కు వచ్చింది. ఆ పైసలతో పెండ్లికి చేసిన అప్పులు తీర్చిన. కేసీఆర్ సారు సాయం చేయకుంటే అప్పు అట్లనే ఉండేది. మా కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు రుణపడి ఉంటాం.
– పేరపు రజిత, శివాజీనగర్, నకిరేకల్
ఉదయ సముద్రం పూర్తయితే నియోజకవర్గం సస్యశ్యామలం
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరందుతుంది. ఈ ప్రాంతం పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికే కుడి, ఎడమ కాల్వల పనులు పూర్తయ్యాయి. సొరంగ మార్గం పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వం విడుతల వారీగా వెంటవెంటనే నిధులు మంజూరు చేయడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కూడా అందజేస్తున్నారు.
– యానాల అశోక్‌రెడ్డి, రైతు, బ్రాహ్మణ వెల్లెంల,
చిట్యాల మండలం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

