‘నాకు కాళ్ల వాపు.. మూత్రం రాకపోయేది.. ఎన్నో దవాఖానలు తిరిగి మందులు వాడినా కిడ్నీ వ్యాధి నుంచి బయటపడలేదు.. డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో వారంలో మూడుసార్లు చేయించుకునేది. ఒక్కసారి వెళ్తే నాలుగు వేల రూపాయలు ఖర్చు అయ్యేది.. కూలీ పనులు చేసుకుని మాకు డయాలసిస్ చాలా భారంగా మారింది’ ఇది రెండేండ్ల క్రితం ఓ కిడ్నీ బాధితుడి బాధ. ఇలాంటి రోగుల సమస్య తీర్చడానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ముందుకొచ్చి ఆలేరు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది ఎంతో మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంజీవనిలా మారింది.
స్వచ్ఛందంగా ప్రజలకు సేవ
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తన సొంత నిధులు రూ. 36 లక్షలు, దాతల సహకారం రూ. 10 లక్షలు కలిపి రూ. 46 లక్షలతో ఆలేరు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో 1200 చదరపు అడుగుల వైశాల్యంలో సకల వసతులతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని భగవాన్ మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో 10 డయాలసిస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2020 జూలై 17న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఈ డయాలసిస్ కేంద్రం ప్రారంభమైంది. 10 యంత్రాలతో రోజుకు ముగ్గురు చొప్పున 25 నుంచి 30 మంది రోగులకు డయాలసిస్ చేస్తున్నారు. ఇందుకోసం అనువభవజ్ఞులైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తుండడంతో పేదలకు ఎంతో ఊరట కలుగుతున్నది. ఈ కేంద్రంలో ఆలేరు నియోజకవర్గంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాం, వరంగల్ జిల్లాకు చెందిన 72 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు సేవలు వినియోగించుకుంటున్నారు.
కిడ్నీ బాధితులకు అండగా నిలిచేందుకే..
రెండేండ్ల కిందట ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ఉదయకుమార్‌రెడ్డి రాత్రి సమయంలో నాకు ఫోన్ చేసి ఏడ్చాడు. నాకు 21 ఏండ్లు ఉన్నాయి.. కిడ్నీ సమస్య కారణంగా డయాలసిస్ కోసం వారానికి రెండు రోజులు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తున్నది.. నాకు నాన్న లేడు.. మా అమ్మ చాలా ఇబ్బంది పడుతున్నది.. సాయం చేయండి అక్కా’ అని ఏడ్చాడు. పాపం ప్రస్తుతం ఆ బాబు ఈ మధ్యకాలంలోనే చనిపోయాడు. ఓ గుడిలో పూజలు చేసే 16 ఏండ్ల పురోహితుడి కుమారుడికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు నా మనసును కలచివేశాయి. అందుకే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలువాలని భావించా. గతంలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో డయాలసిస్ వైద్యమంటే అత్యంత ఖరీదైనది. ఒక్క డయాలసిస్ 24 గంటల సమయం పట్టేది. ఎంతో మంది నిరుపేదలు ఆర్థికంగా చితికి పోయారు. అందుకే ఈ ప్రాంతంలో
డయాలసిస్ కేంద్రం ఉండాలని భావించా. నా సొంత ఖర్చులతో ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశా. ప్రస్తుతం 10 డయాలసిస్ యంత్రాలు నిర్విరామంగా సేవలు అందిస్తున్నాయి. కేవలం 4 గంటల్లోనే డయాలసిస్ చేయించుకుని వెళ్తున్నారు. ఎంతో మంది రోగులకు చికిత్స అందించడం సంతృప్తిగా ఉంది.
– గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
బాధలు తప్పినయి
నా వయస్సు 53 ఏండ్లు. యాదగిరిగుట్టలో మటన్ షాపు నడుపుతా.. కాళ్ల వాపు వస్తుందని ఆస్పత్రిలో చూపించుకుంటే రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటే బతుకుతావని అన్నారు. హైదరాబాద్‌కు వెళ్లి కార్పొరేట్ దవాఖానలో డయాలసిస్ చేయించుకున్నా. ఒక్కసారి డయాలసిస్‌కు 6,500 రూపాయలు తీసుకున్నారు. బతకాలన్న ఆశతో ఏడాదికి 9 లక్షలపైగా ఖర్చు చేసిన. ఆర్థికంగా చితికిపోయిన. ఆలేరులో డయాలసిస్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడే చేయించుకుంటున్నా. కార్పొరేట్ దవాఖాన మాదిరిగా సేవలు అందుతున్నాయి.
– కాంటేకర్ నర్సింహారాజు, యాదగిరిగుట్ట పట్టణం
నెలకు రూ.48 వేలు ఖర్చు అయ్యేది
2019 నుంచి నా రెండు కిడ్నీలు పనిచేయడం లేవు. అప్పట్లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. ఒక్కసారి వెళ్తే 4 వేల రూపాయలు ఖర్చయ్యేది. ఇలా నెలకు 48 వేల రూపాయలు ధారపోశాను.. దాంతోపాటు రవాణాకు తీవ్ర ఇబ్బంది ఉండేది. ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారని తెలిసి ఇక్కడికి వచ్చా.. ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రజలకు సేవ చేసే నాయకుల్లో ఒకరు.
– గుండ్ల ఉపేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, రాయగిరి, భువనగిరి మండలం
కొత్త జీవితాన్నిస్తున్నది
నా వయస్సు 27 సంవత్సరాలు. మూడేండ్ల నుంచి కిడ్నీలు పనిచేయడం లేదు. వారానికి మూడుసార్లు నిమ్స్‌కు వెళ్లి డయాలసిస్ చేయించుకునే వాడిని. ప్రయాణానికి చాలా ఇబ్బంది ఉండేది. ఆలేరులో డయాలసిస్ పెట్టిన తర్వాత ఇక్కడికి వస్తున్నా. చిన్న వయసులోనే కిడ్నీలు పాడయ్యాయి. ఆలేరు డయాలసిస్ కేంద్రం నాకు కొత్త జీవితాన్ని ఇస్తున్నది.
-నూనావత్ వంశీ, గుర్రాలదండి, బీబీనగర్ మండలం
సునీతమ్మ కడుపు సల్లగుండ
సునీతమ్మ కడుపు సల్లగుండాలే. ఆమె ఎవరో నాకు తెలియదు గానీ నాలాంటి కిడ్నీలు పాడైన వారికి డయాలసిస్ సెంటర్‌ను తెచ్చింది. ఇక్కడెక్కడాలేని కేంద్రాన్ని ఆలేరుకు తీసుకురావడమంటే మాటలు కాదు. ఆమెకు, సేవలందిస్తున్న దాతలకు రుణపడి ఉంటాం.
-మాడుగుల అండమ్మ, వేములకొండ, వలిగొండ మండలం