కాంగ్రెస్ సంస్థాగత కమిటీల లొల్లి జోరుగా నడుస్తున్నది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కొనసాగుతున్నది. పాత-కొత్త నేతల మధ్య పంచాయితీ ముదురుతున్నది. ఎమ్మెల్యేలు, కీలక నేతలు చెప్పినా ఏకగ్రీవానికి ససేమిరా అంటూ కాక రేపుతున్నది. ఒక్కో మండలంలో 20కి పైగా దరఖాస్తులు రావడంతో నువ్వా.. నేనా అన్నట్లు ముందుకు సాగుతున్నది. డీసీసీ అధ్యక్షుడి సమన్వయలోపంతోనే సమస్య జఠిలమవుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో సంస్థాగత కమిటీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. 17 మండలాలు, 6 మున్సిపాలిటీలు, ఐదు బ్లాక్ కాంగ్రెస్ పదవులు ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి, మే 26 (నమస్తే తెలంగా ణ): కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. సాధారణంగానే గ్రూపులు కడుతుంటా రు. ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణాలు, మండలాల్లో గ్రూపులు కడుతున్నారు. ఒక్కో మండలంలో నాలుగైదు గ్రూపులుగా చీలి తమకంటే తమకు పదవి ఇవ్వాలని వేడుకుంటున్నారు. దీంతో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. లోలోపల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. దుమ్మెత్తిపోస్తున్నారు.
ఏకంగా సోషల్ మీడియాలో తిట్టిపోసుకుంటున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాల ముఖ్య కార్యకర్తలతో ఈ నెల 10న సమావేశం ఏర్పాటు చేయగా, గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి సమావేశం నిర్వహించగా అడ్డగూడూరు, మోత్కూరు మండలాల నుంచి ఆరు చొప్పున, మోత్కూరు పట్టణ అధ్యక్షుడి కోసం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కోఆర్డినేట్ చేయడం తలనొప్పిగా మారింది.
సంస్థాగత కమిటీలను అందరి అభిప్రాయంతో ఏకగీవ్రం చేయాలని భావించారు. ఇందుకోసం ఆయా చోట్ల పార్టీ కార్యాలయాల్లో పీసీసీ పరిశీలకుడు, డీసీసీ అధ్యక్షుడు సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. ఇందులోనే ఏకాభిప్రాయంతో కమిటీలను ఎన్నుకోవాలనుకున్నా నేతల మధ్య ఉన్న పోరుతో అది సాధ్యం కాలే దు. ఏకంగా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నా.. వినకుండా ఏకగ్రీవానికి అంగీకరించలేదు. ప్రస్తు తం యాదగిరిగుట్ట పట్టణం, మండలం ఏకగ్రీవమైనట్లు తెలుస్తున్నది. తొలుత తుర్కపల్లి ఏకగ్రీవం అనుకున్నా.. ఆ తర్వాత కొం దరు నేతలు అభ్యంతరం చెప్పినట్లు ప్రచా రం జరుగుతున్నది. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అండెం సంజీవ రెడ్డి పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని, ఆయనకు నేతలకు సమన్వయం లేదని హస్తం నేతలే గుసగులాడుతున్నారు.
కాంగ్రెస్ పాత, కొత్త కాపుల మధ్య కోల్డ్ వా ర్ జోరుగా నడుస్తున్నది. అయితే ఎమ్మెల్యే ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి హస్తం పార్టీలో చేరారు. ఆ సమయంలోనే వలస నేతలకు పదవులు, అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. ఇప్పుడు టైం రావడంతో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త నేతలు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగానే.. పాత లీడర్లు రంగంలోకి దిగుతున్నారు. అధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకొని జెండా మోశామని, తమను కాదని వేరే వాళ్లకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో ఆశావహులు బరిలో నిలుస్తున్నారు. గుండాలలో 22 మంది, బొమ్మలరామారంలో 22 మంది బరిలో నిలిచారు. ఆలేరు పట్టణం, మండలం, మోటకొండూరు, ఆత్మకూరు(ఎం)లోనూ పదులు సంఖ్యలో బరిలో ఉన్నారు. అయితే బరిలో నిలిచిన ఆశావహులను ఉపసంహరింపజేసేలా ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
గుండాల, మే 26: గుండాల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఇటీవల టీపీసీసీ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం కసరత్తు మొదలైంది. అందులో భాగంగానే ఈ నెల 21న గుండాల మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ సభ్యులు లకావత్ ధన్వంతి, పులి అనిల్ కుమార్, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి నామినేషన్లు తీసుకునే వరకు సీన్ ఒకలా ఉంటే నామినేషన్ల తదుపరి సీన్ ఎవరికి వారుగా అనుకూలంగా మార్చుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవి కోసం 18 మంది తమ నామినేషన్లు అందించగా. ముగ్గురు నాయకులు ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తమ నామినేషన్లను సమర్పించారు. ప్రస్తుతం మండల అధ్యక్షుడిగా ఉన్న ఏలూరి రాంరెడ్డి తన పదవిని కొనసాగించాలని.. లేదంటే తాను సూచించిన వ్యక్తికే మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన ఆశావహులతో సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారు. 14 మంది తనకు మద్దతు తెలుపుతున్నారని వారి మద్దతు తనకే ఉందంటూ సంతకాలతో కూడిన లేఖను డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డికి లేఖను సమర్పించినట్లు సమాచారం.
మరోవైపు ఉమ్మడి నల్లగొండ ఆల్డా మాజీ డైరెక్టర్ ఇమ్మడి దశరథ గుప్తా సైతం అధ్యక్ష పదవి రేసులో తన మద్దతుదారులతో ముందుకు సాగుతున్నారు. ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఈరసరపు యాదగిరి గౌడ్‌తో పాటుగా మరో ముగ్గురు నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డీసీసీ అధ్యక్షుడి పదవికి గుండాలకు చెందిన ఓ నాయకుడు పోటీలో ఉంటున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుకు జత చేస్తూ.. ఏలూరి రాంరెడ్డి ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదే’ అంటూ రీపోస్టు చేశారు.