ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగంగా చేయాలని, నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను డీఆర్డీఓకు అప్పగించాలని అధికారులకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 9 : అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రహదారులు భవనాలు, నీటిపారుదల శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లను డీఆర్డీఓకు అప్పగించాలని, అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చీకటిమామిడి నుంచి మూడుచింతలపల్లి రోడ్డు, అటవీ ప్రాంతంలో మిగిలిపోయిన రోడ్డు పనులను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అనంతారం నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో ఫకీర్గూడ, మేడిపల్లి, మైలారం గ్రామాల పరిధిలో రోడ్డు పనులను చేపట్టాలని యాదగిరిగుట్ట నుంచి చేర్యాల వయా రాజాపేట రోడ్డును వెంటనే చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలన్నారు. ఆలేరు నియోజకవర్గ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ నర్సింహ, ఈఈ శంకరయ్య, డీఈఈ బీల్యానాయక్, ఏఈఈ కరుణాకర్ పాల్గొన్నారు.