మిర్యాలగూడ, మార్చి 21 : వేలకు వేలు పెట్టుబడి పోసి, అష్టకష్టాలు పడి సాగు చేసిన పంట చేతికి వచ్చినా అన్నదాతకు మార్కెట్లో ‘మద్దతు’ దక్కడం లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుతోపాటు నాన్ఆయకట్టులో బోర్ల ఆధారంగా ముందుగా నాట్లు పెట్టిన సన్న రకం వరి వంగడాల కోతలు మొదలయ్యాయి. మిర్యాలగూడలో రైస్ మిల్లులు అధికంగా ఉండడంతో నాలుగైదు రోజుల నుంచి కోసిన సన్నవడ్లను రైతులు ఇక్కడికి తీసుకువసున్నారు. కానీ, మిల్లర్లు మాత్రం తేమ, తాలు పేరు చెప్పి రైతులకు నరకం చూపిస్తున్నారు.
నానా సాకులతో వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను తిప్పి పంపుతున్నారు. ఒక్కో రైతు పది నుంచి 15 మిల్లులకు తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. ఎవరైనా ముందుకువచ్చినా తక్కువ ధరకు అడుతున్నారు. మిల్లర్లు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యానికి రూ.2320 మద్దతు ధర, అదనంగా బోనస్ రూ.500 ఉండగా, రైస్ మిల్లర్లు మాత్రం కేవలం రూ.2,300 నుంచి రూ.2,400 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.మిల్లర్లు సిండికేట్ అయ్యి వడ్లు కొనకుండా ధర తగ్గిస్తూ దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ లోడ్లతో వచ్చినందున కిరాయిలు మీద పడుతుండడంతో అడిగిన కాడికి ధాన్యం అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతులు ఎక్కువగా హైబ్రిడ్ వరి వంగడాలైన సన్న రకం ధాన్యం పండిస్తారు. ముందుగా నాటు పెట్టిన పొలాలకు సంబంధించి కోతలు మొదలు కాగా, చేతికి పంటను రైతులు మిర్యాలగూడలోని రైస్ మిల్లులకు తీసుకొస్తున్నారు. కాగా, మిల్లర్లు సిండికేట్ అయ్యి నరకం చూపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వరి పంటను రైతులు సహజంగానే కోత మిషన్ల ద్వారా కోయడం ద్వారా ధాన్యంలో స్వల్పంగా తాలు గింజ కనపడుతుంది. తేమ శాతం ఉంటుంది. మిల్లర్లు ఈ ధాన్యం కొనుగోలు చేసి డ్రై చేసి నిల్వ పెట్టుకోవడం ఎప్పుడూ జరిగేదే. కానీ.. మిల్లర్లు తేమ, తాలు శాతం ఎక్కువ ఉందని కొర్రీలు పెట్టి తక్కువ ధరకు ధాన్యం అడుగుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీ ఇష్టం ఉన్న చోట అమ్ముకోపో అంటూ బెదిరిస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. దాంతో చేసిదిలేక అడిగిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు ధాన్యం లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్‌ను 15 మిల్లులకు తిరిగినా తక్కువ ధరకు అడుగుతున్నట్లు తెలిపారు. ధాన్యం మంచిగా ఉన్నా సిండికేట్ అయ్యి రేటు పెట్టడం లేదని వాపోయారు. నకిరేకల్ మండలం తోకబావిగూడెం గ్రామానికి చెందిన నరేశ్‌రెడ్డి అనే రైతు రెండు లోడ్ల ధాన్యం తీసుకొచ్చి పదికి పైగా మిల్లులు తిరిగారు. అయినా ఎవరూ కొనుగోలు చేయడం లేదని దిగాలుగా ఓ మిల్లుల వద్ద లోడ్ ట్రాక్టర్లతో కనిపించారు. అధికారులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు.
మాడ్గులపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక రైతు ఒకే పొలానికి చెందిన ధాన్యాన్ని మొదటి రోజు తీసుకొస్తే రూ.2470 ధర పెట్టారు. రెండో రోజు రూ.2,440, మూడో రోజు రూ.2,400కి కొనుగోలు చేసినట్లు తెలిపారు. నానా కష్టాలు పడి పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం మిల్లుల వైపు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఐదెకరాల్లో సన్నరకం వడ్లు పండించాను. ధాన్యం బాగుంది. రెండు ట్రాక్టర్లలో గురువారం ఉదయం మిల్లుకు తీసుకొచ్చాను. 15 మిల్లులకు తిరిగినా తాలు సాకు చెప్పి ఎవరూ ధాన్యం తీసుకోలేదు. ఒకవైపు ట్రాక్టర్ కిరాయిలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండకు గోస తీస్తున్నాం. వడ్లు ఎలాగైనా అమ్ముకోవాలని మిల్లు దగ్గరే పడిగాపులు గాస్తున్నా. అధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదు. వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇప్పుడే మిల్లర్లు ఇట్ల ఇబ్బంది పెడితే.. కోతలు ముమ్మరమైతే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం స్పందించి రైతుల న్యాయమైన గిట్టుబాటు ధర ఇప్పించాలి.
-నరేశ్‌రెడ్డి, రైతు, నకిరేకల్
నాకు ఆరెకరాల పొలం ఉంది. కోత మిషన్ దొరకకపోవడంతో రెండు రోజులు వరి కోశాను. మొదటి రోజు తెచ్చిన వడ్లకు రూ.2,310, రెండో రోజు రూ.2,360కు కొనుగోలు చేశారు. ఒకే పొలంలో పండించిన ఒక్కటే రకం వడ్లకు ధరలో తేడా ఎందుకు? ఐకేపీ కేంద్రాల్లో మద్దతు రూ.2,320. బోనన్ 500 కలిసి రూ.2820 ఇస్తుంటే రైస్‌మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. అధికారులు మాత్రం మిల్లుల వైపు కన్నెత్తి చూడడం లేదు.
– యాదయ్య, రైతు, తిప్పర్తి
మా ఊరి శివారులోనే రైస్ మిల్లులు చాలా ఉన్నాయి. ఈ మిల్లుల కాలుష్యం వల్ల మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినా కనికరం లేని మిల్లర్లు మా ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదు. నా పొలంలో పండించిన ధాన్యం అమ్ముకుందామని గురువారం లోడ్ తీసుకుని వచ్చాను. రెండు రోజులైంది. ఎవరూ తీసుకోవడం లేదు. మిల్లర్లు సిండికేట్ అయ్యి కావాలనే ధాన్యం తీసుకోకుండా ధర తగ్గించాలని చూస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
-పి.శ్రీను, రైతు, శెట్టిపాలెం