చౌటుప్పల్, ఏప్రిల్ 15 : అనాథలకు సేవ చేసే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని ఆయన సందర్శించారు. తన కుమారుడు పవన్ జ్ఞాపకార్థం పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య, వైద్యం, ఆర్థిక సాయం అందించనున్నారు. అందులో భాగంగా మంగళవారం ఇక్కడకు వచ్చారు. మానసిక స్థితి సరిగ్గా లేక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథలతో మాట్లాడారు.
వారికి పిచ్చిగా పెరిగిన జట్టును కత్తిరించారు. ఆనంతరం బాబుమోహన్ మాట్లాడుతూ అనాథలు దేవుడి ప్రతిరూపాలని, దైవ సంకల్పంతోనే వారికి సేవ చేసే భాగ్యం దక్కుతుందని అన్నారు. యువత కుటుంబాన్ని గుర్తు చేసుకుని బైక్లు నడపాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వహకులు గట్టు శంకర్, శ్రావణి, శ్యామ్ పాల్గొన్నారు.