శుక్రవారం 22 జనవరి 2021
Medchal - Nov 22, 2020 , 04:30:19

ఒంటరిగా ఉన్నోళ్లే టార్గెట్‌

ఒంటరిగా ఉన్నోళ్లే టార్గెట్‌

దుండిగల్‌: జల్సాలకు అలవాటుపడ్డారు. విచ్చలవిడిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యారు.  డబ్బు కొరత రాకుండా ముఠాగా ఏర్పడి వరుసగా చోరీలకు పాల్పడ్డారు. అర్ధరాత్రుల్లో ఆటోలో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నోళ్లనే టార్గెట్‌ చేస్తారు. వారి వద్ద ఏది ఉంటే దాన్ని లాక్కొని, కత్తులతో బెదిరింపులకు గురిచేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను దుండిగల్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఎ.వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం...పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ నర్సింహారావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం తనిఖీలు చేపడుతుండగా, ఒకే ఆటోలో వెళ్తున్న ఐదుగురిని విచారిస్తుండగా తప్పించుకునేందుకు యత్నించారు. వారిని పట్టుకొని ఠాణాకు తరలించారు. 

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన బోయిని ప్రశాంత్‌ (20), మెదక్‌ జిల్లా పోచారం మండ లం అప్పాజిపల్లికి చెందిన కన్నెబోయిన యాగోండ అలియాస్‌ లక్కి (21), మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండ లం చింతకుంటకు చెందిన బేగరి నవీన్‌ (21), ఎరుకల్‌ వెంకటేశం(26), సంగారెడ్డి జిల్లా మంబాపు గ్రామానికి చెందిన కొండరి వినోద్‌ (26) గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. వీళ్లంత మద్యానికి బానిసై గంజాయికి అలవాటుపడ్డారు. ఆటో లో ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్నవారిని అడ్డుకొని కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు అపహరించి నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేసి వెళ్లేవారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వీరి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన ఆటో, ఏడు సెల్‌ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నామని దుండిగల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.వెంకటేశం తెలిపారు. ఈ మేరకు వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని ఆయన చెప్పారు. ముఠాను పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని అభినందించారు.logo