శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Jul 03, 2020 , 01:37:22

లాక్‌డౌన్‌లోనూ. .అభివృద్ధి పరుగులు

లాక్‌డౌన్‌లోనూ. .అభివృద్ధి పరుగులు

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట 

రోడ్ల మరమ్మతులకు నిధులు

 నేరేడ్‌మెట్‌ : ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఇప్పుడు పలు అభివృద్ధి పనులతో ముందుకు దూసుకుపోతున్నది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చిన్న చూపుతో అభివృద్ధి జరుగక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో అన్ని రంగాలు అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చొరవతో తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ స్థానంలో కొత్త పైపులైన్లు, తాగునీటి సమస్య పరిష్కరించడానికి డివిజన్‌లో ఇప్పటికే రూ. 10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. అంతే కాకుండా ఎంతో కాలంగా ఇబ్బందులకు గురిచేసిన రహదారుల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక కార్పొరేటర్‌ శ్రీదేవిలు సహకారం అందించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సకాలంలో పూర్తి చేస్తాం

 నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలో అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లను పునరుద్ధరించడానికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్‌ శ్రీదేవి హన్మంతరావు చొరవతో అన్ని కాలనీల్లో కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా ఏండ్ల కింద వేసిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాం. డివిజన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

- ఏఈ సృజన 

మౌలిక వసతులు కల్పిస్తాం

 గత కొన్నేండ్లుగా అభివృద్ధికి నోచుకోని మల్కాజిగిరి నియోజకవర్గం. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఓ వైపు లాక్‌డౌన్‌ ఉన్నా.. ప్రతి డివిజన్‌లో అభివృద్ధి పనులను నిర్విరామంగా కొనసాగించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం అన్ని డివిజన్‌ పరిధిలో సీసీరోడ్డు పనులు, డ్రైనేజీ పనులు చేపడుతున్నాం. 

- ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు