సంగారెడ్డి, జూన్ 16: దేశంలోనే రాష్ట్రాన్నిఅభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ మూడోసారి సీఎంను చేసేందుకు కంకణబద్ధులు కావాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి కోరారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి వేడుకలను పీఎస్ఆర్ గార్డెన్లో కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పారిశుధ్య కార్మికులకు సన్మానించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ పనిచేసే నాయకుడిని ఎన్నుకుని అభివృద్ధికి పాటుపడాలన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ఉన్న మురికివాడలు, పందుల స్వైరవిహారంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ప్రస్తుతం పరిస్థితులు మారాయన్నారు. నియోజక వర్గంలో మరోసారి చింతా ప్రభాకర్‌ను, రాష్ట్రంలో కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
రాష్ర్టానికి తొలి సీఎం కేసీఆర్ కావడం అదృష్టం
కొట్లాడి సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడంతోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. సంగారెడ్డికి ముఖద్వారంగా ఉన్నా పోతిరెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణకు మంత్రి కేటీఆర్‌ను కోరగానే రూ.17 కోట్లు మంజూరు చేశారన్నారు. నాల్సాబ్గడ్డ ప్రాంతంలో వర్షాలు పడగానే ఇండ్లలోకి నీరు చేరి బస్తీవాసులు ఇబ్బంది పడేవారని, వారి బాధలు తొలిగించేందుకు మురుగు కాల్వ నిర్మించామన్నారు. పట్టణంలో 5600 మందికి ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగులకు రూ.3016 నుంచి రూ.4116కు పింఛన్ పెంచి అందజేస్తున్నారన్నారు. తెలంగాణకు 26 అవార్డులు రావడానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనమన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారన్నారు. జిల్లా తరఫున సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, కౌన్సిలర్లు సోహెల్ అలీ, శ్రీకాంత్, లాడే మనీలా, స్రవంతి, లావణ్య, ఉమామహేశ్వరి, మంజులత, పవన్‌నాయక్, రామప్ప, నాగరాజు, వెంకట్రాజు, అశ్విన్‌కుమార్, విష్ణువర్ధన్, జడ్పీటీసీలు సునీత, కొండల్‌రెడ్డి, ఎంపీపీ సరళ, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ పాల్గొన్నారు.
– హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్