నారాయణఖేడ్, మార్చి 14: జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జరగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రజల గొంతుకగా మారి ప్రశ్నిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ నేతృత్వంలో తాను పోరాడానని గాలి అనిల్‌కుమార్ గుర్తు చేశారు. తనను జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుబిడ్డను, తెలంగాణ ఉద్యమకారుడినైన తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. గాలి అనిల్‌కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత మల్కాపురం శివకుమార్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.