రామచంద్రాపురం, మార్చి 3: ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్లైన్లో 6 కత్తులకు ఆర్డర్ పెట్టాడు. డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసైన ఆ యువకుడు సొంత కుటుంబంపైనే తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు.
కొడుకే తల్లిని విచక్షణరహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన సోమవారం తెల్లావారుజామున సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెల్లాపూర్కి చెందిన నవారి మల్లారెడ్డికి భార్య రాధికరెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సందీప్‌రెడ్డి ప్రైవేట్ ఉద్యోగి, చిన్న కుమారుడు కార్తీక్‌రెడ్డి (26) బీటెక్ చదివి ఖాళీగా ఉంటున్నాడు. తెల్లాపూర్‌లోని డివినోస్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు.
నవంబర్‌లో పెద్ద కుమారుడు సందీప్‌రెడ్డి వివాహం జరిగింది. మత్తు పదార్థాలకు బానిసైన చిన్న కుమారుడు కార్తీక్‌రెడ్డి కారణంగా ఇంట్లో ఆస్తి కోసం తరుచూ గొడవలు జరిగేవి. కార్తీక్‌ని రెండు నెలల క్రితం బెంగళూరులోని రిహాబిటేషన్ సెంటర్‌కు పంపించారు. అక్కడి నుంచి నెల ముందు ఇంటికి వచ్చిన కార్త్తీక్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. తనకు రావాల్సిన ఆస్తి తనకు ఇవ్వాలంటూ తల్లి, తండ్రితో గొడవ పడేవాడు. ఆస్తిని ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులపై పగ పెంచుకొని వారిని హత్య చేయాలని కుట్ర పన్నాడు.
తల్లితో పాటు తండ్రి, సోదరుడిని హత్య చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగా నెల క్రితం 6 కత్తులను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. అతని కుట్రలో భాగమే ఆదివారం రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చి పడుకున్నాడు. సోమవారం తెల్లావారుజామున ఇంట్లో తన తల్లి రాధికరెడ్డి(51), తండ్రి మల్లారెడ్డి నిద్రిస్తున్న క్రమంలో మొదట తల్లిపై కత్తితో దాడి చేశాడు. వెంటనే తేరుకున్న తండ్రి మల్లారెడ్డి అతని చేతిలో ఉన్న కత్తిని గుంజుకుంటున్న క్రమంలో అతనికి కూడా గాయమైంది. కత్తిని గుంజుకొని అరుస్తూ బయటకు పరుగులు తీశాడు.
ఈ చప్పుడు విన్న సోదరుడు సందీప్‌రెడ్డి, అతని భార్య పైన ఉన్న బెడ్రూం నుంచి కిందకు వచ్చి చూసేసరికి మరో కత్తితో తల్లిని విచక్షణరహితంగా పొడవగా ఆమె తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దీనిని గమనించిన సందీప్‌రెడ్డి భార్య శిరీష అడ్డుకోవడంతో, వదిన మీరంటే తనకు గౌరవం అని, పక్కకు జరగండి అని ఆమెతో అంటున్న సమయంలో సందీప్‌రెడ్డి తన బెడ్రూంలోకి వెళ్లి లాక్ వేసుకున్నాడు.
బయట నుంచి తండ్రి అరుస్తుండడంతో ఇరుగుపొరుగు వారు బయటకు వస్తుండడం గమనించిన అతను అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఆమెను సిటిజన్ దవాఖానకు తీసుకువెళ్లడంతో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. విషయం తెలుసుకున్న కొల్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భర్త మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్తీక్రెడ్డ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.