సిద్దిపేట, ఏప్రిల్ 13 : వైద్యవిద్య విజయవంతంగా పూర్తిచేసి పట్టాలు అందుకున్న యువవైద్యులు ఉత్తమ సేవలు అందించి రోగుల గుం డెల్లో గూడుకట్టుకోవాలని, పదికాలాల పాటు గుర్తుండేలా సేవలు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేటలోని సురభి వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వైద్యవిద్య కొందరికే పరిమితం అయ్యిందని, నేడు సిద్దిపేటలో పేద దర్జీ నలుగురు బిడ్డలు నేడు వైద్య విద్య చదువుతున్నారంటే తెలంగాణలో వైద్యవిద్యను బలోపేతం చేయడమే కారణం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో స్థానికులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏండ్లలో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు జరిగితే, స్వరాష్ట్రంలో 9 ఏండ్లలో 29 మెడికల్ కాలేజీలు కేసీఆర్ ఏర్పాటుచేసి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల తయారీలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. గతంలో చైనా, ఉక్రెయిన్, రష్యా, యూరప్ దేశాలకు వెళ్లి, పరిచయం లేని భాషలో అపసోపాలు పడుతూ మన పిల్లలు ఎంబీబీఎస్ చదివారని, ఇప్పుడు ఆ బాధ తప్పిందన్నారు.
కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు, లోకల్ రిజర్వేషన్ కారణంగా తెలంగాణ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయన్నారు. ‘మెడిసిన్స్ క్యూర్ డిసీజెస్, బట్ ఓన్లీ డాక్టర్స్ కెన్ క్యూర్ పేషెంట్స్’. రోగులతో ప్రేమగా మాట్లాడితే వారి వ్యాధి సగం తగ్గుతుంది. మందులు రోగాన్ని నయం చేస్తే, వైద్యులు మాత్రమే రోగిని పూర్తి ఆరోగ్యవంతున్ని చేస్తారని హరీశ్‌రావు అన్నారు.
ఎన్ని మందులు ఇచ్చామనే దానికంటే, ఎంత ప్రేమగా మాట్లాడారు. వైద్యులు ఇచ్చే ధైర్యం సగం రోగాన్ని తగ్గిస్తుందన్నారు. ప్రాణం పోసేది అమ్మ అయితే, పునర్జన్మ నిచ్చేది వైద్యుడు మాత్రమే అన్నారు. యువ వైద్యులు వైద్యవృత్తికి మరింత గౌరవాన్ని తేవాలని కోరారు. సురభి దవాఖానలో క్యాత్ లాబ్ ఏర్పాటుచేసి కార్డియాక్ సేవలు అందించాలని, క్యాన్సర్ కీమోథెరఫీ, రేడియోథెరపీ సేవలు అందుబాటులోకి తేవాలని హరీశ్‌రావు కోరారు.