ఝరాసంగం, మార్చి 18 : మండల పరిధిలోని కుప్పానగర్ కొలువుదీరిన గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 31వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకము, వడిబియ్యము, కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించారు.
సాయంత్రం గ్రామ మహిళలు, భక్తులు, పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాల మధ్య అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించారు. రాత్రికి శ్రీ రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు. మండలంలో ఎక్కడలేని విధంగా నాటక ప్రదర్శన జరగడంతో వివిధ గ్రామాల ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ 1008 డాక్టర్ మహత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పూజ నిర్వహించి నాటక ప్రదర్శనను ప్రారంభించారు. తెలంగాణ యాస, సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించడం అభినందనీయమన్నారు.