
మెదక్, డిసెంబర్ 14: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రంలో నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య, జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్, జిల్లా ఎన్నికల సహాయ అధికారి రమేశ్, అభ్యర్థులు వంటేరి యాదవరెడ్డి, నిర్మల, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూం సీలును అధికారులతో ఓపెన్ చేశారు. అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను కౌంటింగ్ రూంలోకి తీసుకెళ్లారు. అక్కడ కౌంటింగ్ అధికారులు ఆయా పార్టీల ఏజెంట్ల ముందు బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేశారు. అనంతరం బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బండిల్స్ కట్టారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.
యాదవరెడ్డికి ధ్రువపత్రం అందజేత
ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డి 524 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు మాదాసు శ్రీనివాస్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూడు రౌండ్లలోనే ఫలితాలు..
ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1026 ఓట్లు ఉండగా, అందులో 1018 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం లెక్కింపు చేపట్టగా, 1018 ఓట్లలో 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించగా, 1006 ఓట్లు గుర్తింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డికి 6 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 524 ఓట్ల మెజార్టీతో యాదవరెడ్డి విజయం సాధించారు. మొదటి రౌండ్లో మొత్తం 400 ఓట్లను లెక్కించగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 299, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 96 ఓట్లు వచ్చాయి. మొత్తం 395 ఓట్లు చెల్లినవి కాగా, 5 ఓట్లు చెల్లనివి. రెండో రౌండ్లో మొత్తం 400 ఓట్లను లెక్కించగా, టీఆర్ఎస్కు 286 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 106 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 2 ఓట్లు వచ్చాయి. మొత్తం 394 ఓట్లు చెల్లినవి కాగా, 6 ఓట్లు చెల్లనివిగా ఉన్నాయి. రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థికి 585 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 202 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 177 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 36 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు వచ్చాయి. మొత్తం 218 ఓట్లకు గాను 217 ఓట్లు చెల్లినవి కాగా, ఒకటి చెల్లలేదు.
సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు
ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కౌంటింగ్ కేంద్రానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదవరెడ్డిని గజమాలతో సన్మానించారు. టీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సంబురాలు చేసుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాకులు కాల్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు నాంది.. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాయని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారన్నారు. యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ది నిర్మలకు 238 ఓట్లు మాత్రమే వచ్చాయని, 524 ఓట్ల మెజార్టీతో యాదవరెడ్డి ఘన విజయం సాధించారని తెలిపారు. అంతేకాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణ, దండె విఠల్, ఎంపీ కోటిరెడ్డి, తాత మధు ఘన విజయం సాధించారన్నారు.