సిద్దిపేట అర్బన్, నవంబర్ 11 : తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను గురుకుల పాఠశాలలకు చదువు కోసం పంపిస్తే, అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థినులతో వెట్టి చాకిరీ చేయిస్తూ వారిని పనివాళ్లలాగా మారుస్తున్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. చదువుకొని తమ పిల్లలు ప్రయోజకులుగా మారాలని తల్లిదండ్రులు ఆశించి విద్యార్థినులను గురుకులాలకు పంపిస్తే, వారితో విద్యార్థినులందరికీ చపాతీలు, ఇతర పనులు చేయిస్తున్నారు.
ఆ చేస్తున్న చపాతీలు ఒక్కరికో, ఇద్దరికో కాదు.. ఏకంగా 670 మంది విద్యార్థులకు చపాతీలు చేస్తున్నారంటే వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆర్థం చేసుకోవచ్చు. నిత్యం సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఏదో ఒక పాఠశాలను, గురుకులాన్ని సందర్శించి ఉపాధ్యాయులకు, హాస్టల్ నిర్వాహకులకు సూచనలు చేస్తున్నా, వారు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ విద్యార్థినులను హీనంగా చూడడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు నిద్రలేపి సెక్షన్ల వారీగా చపాతీలు చేయిస్తారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. చపాతీలు చేయడంతో తమ చేతులు నొప్పులు వస్తున్నాయని కొంతమంది విద్యార్థినులు వాపోయారు. కొంతమంది విద్యార్థినులు చపాతీలు చేస్తుండగా, మరికొందరు చపాతీలను కాలుస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ మార్తను వివరణ కోరగా.. తన ఆరోగ్యం బాగాలేదని, తనకు హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియదని చెప్పడం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
