పాపన్నపేట, డిసెంబర్ 25: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను సకుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబ సభ్యులతో ఏడుపాయలకు చేరుకోగా పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, ఈవో శ్రీనివాస్ ధర్మకర్తలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ మని, ఇలాంటి పవిత్ర భూమిలో బీజేపీ ప్రభుత్వం మతాలను వేరుచేస్తూ ప్రజలను విభజించాలని చూస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దుందుడుకు చర్యలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటుచేశారన్నారు. ఉచిత విద్యుత్‌ను అందించాలన్నా తలంపుతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ని నెలకొల్పినట్లు వెల్లడించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి నిధులు కేటాయించి పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలన్న సంకల్పంతో జాతీయ స్థాయిలో పార్టీని నెలకొల్పినట్లు తెలిపారు. మంత్రి వెంట జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, సర్పంచ్ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ఏడుపాయలకు చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాం తాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఏర్పాట్లు చేశారు. పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ బందోబస్తు చేపట్టారు.