బెజ్జంకి, ఏప్రిల్ 24: సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో గురువారం గాలిదుమారానికి చింతకాయ రాలిందని ఏరుకోబోయి పిడుగుపాటుకు గురై టేకు రంగవ్వ(59) మృతిచెందింది. మనువడు శ్రీధర్‌తో కలిసి చెట్టు వద్దకు వెళ్ల్లిన కొద్ది సమయానికే పిడుగుపడగా రంగవ్వ, బాలుడు ఇద్దరు అపస్మారక స్థితికి వెళ్లారు. రంగవ్వను సిద్దిపేట దవాఖానకు తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడిని కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రంగవ్వకు భర్త శంకరయ్య, కుమార్తె, ఐదుగురు కుమారులు ఉన్నారు.
బెజ్జంకి మండలంలో కురిసిన వడగండ్ల వర్షం, గాలిదుమారానికి లక్ష్మీపూర్‌లో విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు మామిడికాయలు నేలరాలయి. మామిడి, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు, పిడుగుపాటుతో మృతిచెందిన రంగవ్వ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి కోరారు.
మునిపల్లి, ఏప్రిల్ 24: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలోని తాజ్ రెస్టారెంట్లో గురువారం సాయంత్రం గోడకూలి గర్భిణి మృతిచెందింది. పోల్కంపల్లికి చెందిన గర్భిణీ మన్నె శ్రావణి(22) సదాశివపేటలోని ఓ దవాఖానలో పరీక్షలు చేయించుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. గాలిదుమారంతో కూడిన వర్షం రావడంతో తాజ్ రెస్టారెంట్ దగ్గర నిలబడగా గోడకూలి ఆమెపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సదాశివపేట దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది.
రాయికోడ్, ఏప్రిల్ 24: మండలంలోని వివిధ గ్రామా ల్లో కురిసిన వర్షం, ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. రైతులు సాగు చేసిన జొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.