కల్హేర్, జనవరి 19: పుట్టిన నుంచి ఒక చేయి, ఒక కాలు పనిచేయక గెంటుకుంటూ పనులు చేసుకునేది. కన్న తండ్రి బతికి ఉన్నప్పుడు బాగోగులు చూసేవారు. పదిహేనేండ్ల క్రితం కన్న తండ్రి కాటికి పోయినప్పటి నుంచి దిక్కులేని బతుకుదెరువుతో జీవనం గడుపుతున్నది. చిన్న రేకుల షెడ్లో బతుకు వెళ్లదీసింది. శనివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దివ్యాంగురాలు సజీవ దహనమైన ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగ్ధర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై వెంకటేశం వివరాల ప్రకారం.. నాగ్ధర్ గ్రామానికి చెందిన కంద్రి లింగయ్యకు కొడుకు జీవరత్నం, కూతురు కంది ప్రేమల (45) సంతానం. కంది ప్రేమల పుట్టుకతో ఒక చేయి, ఒక కాలు పనిచేయదు. ప్రేమల బాగోగులను తండ్రి లింగయ్య చూసేవాడు. ఆయన 15 ఏండ్ల కింద మృతిచెందాడు.
అప్పటి నుంచి ప్రేమలకు గడ్డుపరిస్థితులు మొదలయ్యాయి. నా అన్నవారు ఎవరూ పట్టించుకోలేక పోవడంతో నిరాదరణకు గురైంది. కొందరు బంధువులు, గ్రామంలో కొందరి పంచన ఉంటూ జీవనం గడిపింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రేకుల షెడ్ వేయించి ఆశ్రయం కల్పించారు. శనివారం రాత్రి రేకుల షెడ్లో మంట లు రేగి ఆమె సజీవ దహనమైంది. రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ దవాఖానకు తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.