ఎండాకాలం వచ్చిందంటే చాలు రసాయన పరిశ్రమల్లో ఎక్కువ ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. యాజమాన్యాలు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు యజమానులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుండగా విషవాయువులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గడ్డపోతారంలోని ఎరిత్రో ఫార్మాపరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.
జిన్నారం, ఏప్రిల్ 21 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం, బొంతపల్లి, పాశమైలారం తదితర పారిశ్రామికవాడల్లో ఐదు వందల వరకు భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఎండాకాలం సీజన్ ప్రారంభంకాగానే రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని న్యూట్రల్స్ కెమికల్స్ పరిశ్రమలో వారం రోజుల క్రితం జరిగిన భారీ అగ్ని ప్రమాదం వల్ల ఆస్తినష్టం ఎక్కువగా జరిగింది. దట్టమైన విషవాయువులు వెలువడ్డాయి. తాజాగా గడ్డపోతారంలోని ఎరిత్రో ఫార్మాపరిశ్రమలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. పక్కన ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రతి ఏటా రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నా వీటి నివారణకు అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకోవడం లేదు.

సరైన నిర్వహణలేకనే ప్రమాదాలు
పరిశ్రమల్లో మండే గుణం ఉన్న రసాయన డ్రమ్ముల వద్ద సరైన భద్రత చర్యలు తీసుకోవడం లేదు. రియాక్టర్లు, పాతయంత్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, సేఫ్టీ గైడ్‌లైన్స్ పట్టించుకోకపోవడం, కార్మికులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. రియాక్టర్లో రసాయనాలు కలుపుతున్న సమయంలోనే ప్రమాదాలు జరుగుతుండటంతో ఆందోళన కలిగిస్త్తోంది. రియాక్టర్ వద్ద అనుభవం ఉన్న సిబ్బంది, కార్మికులు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భారీగా వెలువడుతున్న పొగలు
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చే సమయంలో ఉపయోగించే నీరు కాలుష్య జలాలతో కలిసి సమీపంలోని చెరువులు, కుంటల్లోకి వెళ్తుంది. దీంతో చెరువులు, కుంటలు కాలుష్యనీటితో నిండుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవని స్థానికులు అంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే
రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేలా పరిశ్రమలశాఖల అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమ యాజమాన్యాలు, పరిశ్రమలశాఖ అధికారులు అందుబాటులో ఉండటం లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించడంతో పూర్తిగా విఫలమవుతున్నారు.
అగ్నిమాపక కేంద్రం లేక మరింత ఆస్తినష్టం
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రం లేక భారీగా ఆస్తినష్టం జరుగుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో నర్సాపూర్, పటాన్చెరు, జీడిమెట్ల ప్రాం తాల నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చేందుకు గంట నుంచి రెం డు గంటల సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. సమీపంలో ఫైర్‌స్టేషన్ ఉంటే కొంత వరకైనా ఆస్తినష్టాన్ని తగ్గించవచ్చని యాజమాన్యాలు అంటున్నాయి.
నిబంధనలు తప్పక పాటించాలి
పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు తప్పక పాటించాలి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై అధికారులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరగడంతో కాలుష్య సమస్య మరింత తీవ్రమవుతోంది. పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
– సుష్మ, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డపోతారం, సంగారెడ్డి జిల్లా