సిద్దిపేట, నవంబర్ 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదు. పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మినా లారీల లోడింగ్ ఓ సమస్యగా మారింది. కాంటా అయిన ధాన్యం తరలించకపోవడంతో అక్కడే రైతులు కాపలా కాయాల్సి వస్తున్నది. కేంద్రాల నుంచి ధాన్యం పోయినా మిల్లుల వద్ద లారీలు రోజుల తరబడి అన్లోడింగ్ కాకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతున్నది. వీటన్నింటి మధ్యన చేసేది ఏం లేక రైతులు అడ్డికి పావుశేరు చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా మంత్రులు కొనుగోలు తీరుపై సమీక్షలు చేయడం లేదు. మండలాల వారీగా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేదు. ఇప్పటికే దళారులు 40 శాతానికి పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆశించిన మేరకు ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు .క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు అధికారులు చెబుతున్న వాటికి పొంతన లేకుండా పోతున్నది. ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ మేరకు జిల్లాలో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెబుతున్న కొనుగోలు కేంద్రాల్లో అనుకున్న స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తూకం, సంచులు, తేమ, సన్నరకం, దొడ్డురకం తదితర సమస్యలు ఉన్నాయి.
ఎక్కువ శాతం రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకుపోయి మిల్లులకు అమ్ముతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 25,486 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 59.13 కోట్లు కాగా ఇప్పటి వరకు రైతులకు రూ. 13.69 కోట్లు చెల్లించింది. ఈ జిల్లాలో 40 శాతానికి పైగా ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. మెదక్ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుదని అంచనా వేసిన అధికారులు ఆలెక్కన జిల్లాలో ఇప్పటి వరకు సన్నరకానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు 92, దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు 397 మొత్తం జిల్లాలో 489 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 31,529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
మిల్లులకు 19,244 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించారు. రైతులకు చెల్లించిన డబ్బులు కేవలం 31 మందికి రూ. 25 లక్షలు మాత్రమే…జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం చేరుకోవాలంటే 3.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. వీటిలో ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు రైతులు అమ్ముకున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 214 అని ప్రతిపాదించారు. వీటిలో దొడ్డురకం 188 కేంద్రాలు, సన్నరకం 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 18,875 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం విలువ రూ.43.33 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ10.71 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 9,716 మెట్రిక్ టన్నుల ధాన్యం ట్యాబ్లో ఎంట్రీ అయ్యింది.
ధాన్యం సేకరణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో రైతు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు దాటుతోంది. కొన్ని కేంద్రాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. లారీల కొరత ఇబ్బంది పెడుతున్నది. లోడింగ్ అన్లోడింగ్ సమస్యగా మారింది. సరిపడా హమాలీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిల్లుల్లో ధాన్యాన్ని త్వరగా దింపుకోక పోవడంతో సమస్య మరింత జఠిలమవుతున్నది. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం పేరుకుపోతున్నది. బస్తాలు అలానే ఉండిపోతున్నాయి.చాలా వరకు రైతుల ధాన్యం ఇంకా రోడ్లపైనే ఉంది. ట్యాబ్లో ఎంట్రీ అలస్యమవుతున్నది.కొంత మంది వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మళ్లీ కొనుగోలు కేంద్రాల్లో పోసి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదించాయి. ఏదో కొంటున్నామా..? అంటే కొంటున్నాం ..అన్నట్లుగా కొనుగోలు కేంద్రాలను నడిపిస్తున్నారు. పేరుకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కానీ అన్నీ సమస్యలే రాజ్యమేలుతున్నాయి. రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. చినిగిపోయిన గన్నీబ్యాగులు ఇస్తున్నారు. వాటిలో ధాన్యం ఇటు పోస్తే అటు పోతున్నది. తేమ శాతం మిషన్ సక్రమంగా ఉండదు, టార్పాలిన్ కవర్లు, తాలు పట్టే యంత్రాలు ఉండటం లేదు. తూకం వేసిన ధాన్యం తరలించడానికి వారం రోజులకు పైగానే పడుతుందని రైతులు చెబుతున్నారు. ఆయా కేంద్రాల్లో తూకంలో తేడాలు ఉన్నాయి. తాలు, తేమ తదితర వాటి పేరు మీద ఎక్కువ కాంటా చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు రూ. 1900 నుంచి 2100, సన్నరకం ధాన్యాన్ని రూ2400 నుంచి రూ.2500 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు దళారులకు అమ్ముతున్నారు.
శివ్వంపేట, నవంబర్ 12 : చిన్నగొట్టిముక్ల ఐకేపీ కొనుగోలు కేంద్రానికి సన్నధాన్యం తీసుకువచ్చి వారం రోజులు దాటింది.10 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి సాగుచేశా. వారం రోజులుగా ధాన్యాన్ని బాగా ఎండబెట్టా. ధాన్యాన్ని కాంటా వేయమంటే ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని చెబుతున్నారు. సన్నవడ్లకు బోనస్ అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు. ఒకవేళ వర్షం వస్తే పరిస్థితి ఏమిటి. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల బాధలు అర్థంచేసుకోవాలి.
– పానగంటి విఠల్, కౌలు రైతు, చిన్నగొట్టిముక్ల, శివ్వంపేట మండలం, మెదక్ జిల్లా