దుబ్బాక, జనవరి 17 : రైతులు, పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లివాగులోకి నీరు విడుదల చేయకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే బీఆర్ఎస్తో పెట్టుకోవాలని, అమాయక రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. ప్రస్తుత పంటలకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ చేస్తే కాల్వల ద్వారా సాగునీరు అందించామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రైతులను ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమన్నారు. తెలంగాణ సాధించుకున్నది.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమేనని గుర్తుచేశారు. సాగునీటి కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమం తప్పదన్నారు. ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. ప్రపంచ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఆ ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రాజెక్టులు కట్టుకున్నదే సాగునీటి కోసమని, పంటలకు సాగునీరు సరఫరా చేయకపోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు మనోహర్‌రావు, రాజమౌళి, ఎంపీపీ పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), జనవరి 17: పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడమే ధ్యేయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం అక్బర్పేట-భూంపల్లి మండలం మోతె గ్రామంలో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన కమ్యూనిటీ హాల్స్, కూడవెల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనం, అక్బర్‌పేటలో పల్లె దవాఖాన సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మోతె గ్రామంలోని వేంటేశ్వరస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొంపల్లి మనోహర్‌రావు, బీఆర్ఎస్ యువత విభాగం రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గ్రామాలను ప్రతి రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మోతెలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఇంటి వద్ద కూర్చున్న వృద్ధులను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. అమ్మా బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది.. పింఛన్ వస్తుందా? అని వృద్ధురాలు రాజవ్వను ఎమ్మెల్యే అడిగారు. వృద్ధురాలు మాట్లాడుతూ సార్.. గిప్పుడైతే ఆరోగ్యం మంచిగానే ఉంది. నాకు పింఛన్ వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు, సర్పంచులు శ్రీనివాస్, సుగుణానర్సింహులు, స్వరూపాభిక్షపతి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాలమల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవి, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు లింగం, వెంకట్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజేశ్వర్, రమేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.