అందోల్, అక్టోబర్ 4: కొన్ని గ్రామ పంచాయతీలకు నిధులు రాక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతుండగా.. మరికొన్ని జీపీలకు నిధులున్నా పనులు చేపట్టకపోవడంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని నేరడిగుంట పంచాయతీకి ఆదాయం ఉన్నా ఆ స్థాయిలో గ్రామంలో అభివృద్ధి జరగడం లేదు, సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. గ్రామంలో పారిశుధ్యం అటకెక్కింది.
ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలు పెరిగి దోమల బెడద పెరిగింది. పాములు సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయడం లేదని, దోమల మందు పిచికారీ చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు ప్రభుత్వ పాఠశాల ఎదుట పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయని, చెత్తకుప్పలు సైతం వెలిశాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో స్తంభాలకు వీధిలైట్లు సరిగ్గా లేకపోవడంతో రాత్రి అంధకారం అలుముకుంటున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతలో తప్పని చింత..?
ప్రతి బుధవారం నేరడిగుంటలో నిర్వహించే సంతలో సైతం సరైన సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంతకు తైబజార్ వేలంపాటలో ఈ ఏడాది కూరగాయలు 2,02,500, మేకల సంతకు రూ. 3లక్షల ఆదాయం వచ్చింది. కానీ, సంతలో వ్యాపారులు తమ వ్యాపారాలు సాగించేందుకు తగిన సదుపాయాలు లేవు. తైబజార్ కాంట్రాక్టర్ పొందినవారు వ్యాపారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
అధికారులు మా త్రం ఇక్కడ వారికి కనీస సౌకర్యాలు కల్పించాలనే విషయంపై దృష్టిపెట్టడం లేదు. దీంతో పిచ్చిమొక్కల మధ్యనే కూర్చుని వ్యాపారులు వ్యాపారాలు సాగిస్తున్నారు. కనీ సం ఇక్కడ పేరుకుపోయిన చెత్తను సైతం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వస్తుందని, పాములు వస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. అధికారులు గ్రామ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.