మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 21: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట అనగానే ప్రభుత్వ పెద్దలకు ఇక్కడ ఉన్న ఇసుక మాత్రమే గుర్తొస్తుంది. గ్రామంలోని పెద్దవాగు నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్న అధికారులు తదనంతరం జరిగే నష్టాలపై దృష్టి సారించడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరికి వరప్రదాయినిగా ఉన్న పెద్దవాగును గుళ్లచేసి ఇక్కడి రైతుల నోట్లో మట్టికొడుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
వనరులు కొల్లగొట్టడమే తమకు తెలుసు అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. వాగులోని ఇసుక తరలడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయి, నీళ్లు లేక చేతికందే సమయంలో పంటలు,బోరుబావులు ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే రానురాను ఊరి జనానికి గుక్కెడు తాగునీరు కూడా దొరకని పరిస్థితి రానుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోసిపోతున్న చెరువులు, కుంటలు
ఓ వైపు గ్రామంలోని పెద్దవాగు నుంచి అడ్డగోలుగా ఇసుక తరలించడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోతున్నాయి. మరోవైపు గ్రామంలోని ఊర చెరువు, పర్రెలకుంట, బందెల కుంటలో నీళ్లు లేక బోసిపోతున్నాయి. ప్రధాన నీటి వనరుగా ఉన్న వాగు ఒట్టిపోవడం, చెరువు, కుంటలు ఎండిపోవడం వల్ల సాగునీటి సమస్య తలెత్తింది. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామంలో తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2022లో రంగనాయకసాగర్ నుంచి తపాస్పల్లి డీ-3 ఎల్ఎంసీ కాలువ ద్వారా గోదావరి జలాలతో గ్రామంలోని చెరువు, కుంటలు నింపినట్లు గ్రామస్తులు గుర్తు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ధూళిమిట్టలోని చెరువు, కుంటలను గోదావరి జలాలతో నింపాలని కోరుతున్నారు.

చెరువు, కుంటలు నింపాలి
గ్రామంలో ఉన్న ఊరచెరువు, పర్రెలకుంట, బందెల కుంటలను గోదావరి జలాలతో నింపాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగేండ్ల క్రితం గోదావరి జలాలతో చెరువు, కుంటలు నింపారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి గోదావరి జలాలు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. పెద్దవాగు వల్ల ఎక్కడ చూసినా నీళ్లే ఉండేవి. ఇప్పుడు ఆపరిస్థితి లేదు. మా ఊరిలో ఇలాంటి పరిస్థితి గతంలో నేను ఎన్నడూ చూడలేదు.
-శిరబోయిన తిరుపతి, రైతు, ధూళిమిట్ట,సిద్దిపేట జిల్లా
బోర్లు ఎండిపోతున్నాయి
వేసవిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. గ్రామంలోని బోర్లు ఎండిపోతున్నాయి. చెరువు, కుంటల్లో కూడా చుక్క నీరు లేదు. మునపటి లెక్క గోదావరి జలాలతో చెరువు, కుంటలు నింపితే రైతులకు మేలు జరుగుతుంది. ఇదే పరిస్థితి ఉంటే ఎవుసం చేయడం కష్టమవుతుంది. రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవాలి.
-గుజ్జుల మల్లారెడ్డి, రైతు, ధూళిమిట్ట, సిద్దిపేట జిల్లా