కోహీర్, ఏప్రిల్ 20 : ప్రయాణికుల అవసరార్థం కోహీర్ పట్టణంలో స్వాతంత్య్రానికి ముందే దక్కన్ రైల్వేస్టేషన్ నిర్మించారు. అప్పటి నుంచి మండల ప్రజలకు నిర్విరామంగా రైల్వే సేవలందుతున్నాయి. అయితే, రైలు వచ్చే సమయంలో ఐదు నుంచి పది నిమిషాల ముందుగానే గేటు వేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోహీర్, బిలాల్పూర్, మనియార్పల్లి, పైడిగుమ్మల్, నాగిరెడ్డిపల్లి, ఖానాపూర్ గ్రామాల నుంచి నిత్యం అనేకమంది జహీరాబాద్ వైపునకు వెళ్తుంటారు. వీరంతా రైలు వెళ్లేవరకు గేటు వద్ద వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కవేలి-కోహీర్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వేగేటు వద్ద వంతెనను నిర్మిస్తే కష్టాలు తీరుతాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
కోహీర్ నుంచి జహీరాబాద్, బీదర్, హైదరాబాద్ వైపునకు రైలు వెళ్లేందుకు ఒకే మార్గాన్ని నిర్మించారు. ఎప్పుడైనా రెండు రైళ్లు ఒకేసారి వస్తే ఒక రైలు స్టేషన్ వద్దనే నిలుపాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ రెండు రైళ్లు వెళ్లేలా మార్గాన్ని నిర్మించాలని ఇటీవల ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంట్లో ప్రస్తావించారు. డబుల్ లేన్ నిర్మిస్తే రైళ్ల సమయపాలన కూడా సజావుగా కొనసాగుతుందని, వాహనదారుల ఇబ్బందులను తీర్చడానికి వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.
కోహీర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రోడ్డుపై వంతెన నిర్మించాలి. రైల్వే గేటు వేస్తుండటంతో వాహనదారుల సమయం వృథా అవుతున్నది. వంతెనను నిర్మిస్తే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణికుల అవస్థను గుర్తించి వంతెన నిర్మించాలి.
– చరణ్, కోహీర్ వాహనదారుడు
కోహీర్ దక్కన్ రైల్వేస్టేషన్ నుంచి చాలా రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి. కానీ ఇక్కడ సింగల్ లేన్ ఉండటంతో చాలా ఇబ్బందిగా మారింది. ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నారు. డబుల్ట్రాక్ నిర్మించాలని ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంటులో కోరడం హర్షణీయం.
– రాజుస్వామి, బిలాల్పూర్ వాహనదారుడు