గుమ్మడిదల,ఫిబ్రవరి21: డంపింగ్‌యార్డు రద్దు కోసం మా ప్రాణాలైన బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రైతు జేఏసీ నాయకులు 17వ రోజు రిలే నిరాహార దీక్షలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్ గ్రామ శివారులో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన డంపింగ్‌యార్డు అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 11వ రోజు దార్గు ల్లా గ్రామస్తులు నల్లబ్యాడ్జీలు, నల్ల చొక్కలు ధరించి రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.
ఇందులో రాయప్పరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాం రెడ్డి, మహిళలు పాల్గొన్నారు. అనంతరం మహిళా జేఏసీ, రైతు జేఏసీ నాయకులు, యువకులు సంయుక్తంగా నల్లబ్యాడ్జీలు ధరించిన జాతీయరహదారి-765డీపై భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగారు. డంపింగ్‌యార్డు వద్దురా.. జైజవాన్-జైకిసాన్ అం టూ నినదించారు. మహిళలు, పిల్లలు, యు వకులు, రైతులు డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని మహిళా జేఏసీ అధ్యక్షురాలు మల్లమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బైఠాయించిన నిరసనకారులను పోలీసులు విరమింపచేశారు. గుమ్మడిదలలో రిలే నిరాహారదీక్ష కొనసాగేందుకు మందచంద్రారెడ్డి జేఏసీ కమిటీకి రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు చిమ్ముల నర్సింహారెడ్డి, రాజశేఖర్, జేఏసీ నాయకులు దేవేందర్‌రెడ్డి జైపాల్‌రెడ్డి, రమణారెడ్డి, రైతుసంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, రాంరెడ్డి, ఆంజనేయులుయాదవ్, ప్రవీణ్‌రెడ్డి,బాల్‌రెడ్డి,శ్రవ ణ్, రాంరెడ్డి, మురళీ పాల్గొన్నారు.
ప్యారానగర్-నల్లవల్లిలో 17వ రోజు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇందులో కొత్తపల్లి, నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాలకు చెందిన యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా డంపింగ్‌యార్డు వస్తే ఎవుసం ఎగిలిస్తది, పొయ్యిలో పిల్ల పడుకుంటది…గాలి, నీళ్లు తాగకుండా పనికిరాకుండా పోతాయి, ఇక్కడి గ్రామాల ప్రజలు వలస వెళ్లాల్సి వస్తదంటూ బుర్ర కథరూపంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన నలుగురు రైతులు డంపింగ్‌యార్డు భూముల్లో మా భూములు ఉన్నాయని, సర్వే చేసి చూపించాలని కోర్టులో పిటిషన్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా సర్వేయర్ ఏడీ ఐనేస్, డీఐ రాజు, మండల సర్వేయర్ యాదయ్య మరో నలుగురు కలిసి ప్యారానగర్ భూములను సర్వే చేయడం ప్రారంభించారు. దీనికి కోర్టును ఆశ్రయించిన రైతులు అక్కడికి చేరుకున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు చూపించిన హద్దుల నుంచి సర్వే చేయాలని రైతులు ఏడీని కోరారు. రైతులు, సర్వేయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తున్న రాంకీ సంస్థకు అనుకూలంగా సర్వేచేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గ్రామ మ్యాప్, టీపాన్, కాస్రా, పహాణీల ఆధారంగా సర్వే చేస్తున్నామని రైతులకు తేల్చి చెప్పారు. గతంలో చూపించిన హద్దుల ఆధారంగా సర్వే చేయాలని డిమాండ్ చేయడంతో సర్వేయర్ల బృందం వెనుతిరిగింది.