Gummadidala | నర్సాపూర్ : గుమ్మడిదల మండలం ప్యారా నగర్లో ప్రభుత్వం నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్‌ను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్యారా నగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్‌ను వ్యతిరేకిస్తూ నర్సాపూర్ పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి గాలి, నీరు కాలుష్యం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్‌ను రద్దు చేసే వరకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్‌తో పచ్చని అడవి, రాయారావు చెరువు పూర్తిగా కలుషితం అవుతాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజు యాదవ్, రమణారావు, సంఘసాని సురేష్, నర్సింగరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.