చౌటకూర్, డిసెంబర్ 22 : ఎవరి సొత్తు మాకు అక్కర్లేదని, మా వాటా మాకు దక్కాలని దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లె సంజీవయ్య, కార్యక్రమ రాష్ట్ర కో ఆర్డినేటర్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి రమేశ్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 3 హైదరాబాద్లో జరుపతలపెట్టిన ‘వెయ్యి గొంతులు-లక్ష డప్పులు’ మహా ప్రదర్శన సన్నాహక సమావేశం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద ఆదివారం జరిగింది. జై భారత్ రాష్ట్ర కో కన్వీనర్ కాశపాగ ఇమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దళితులంతా ఐక్యంగానే ఉన్నారని, వారిని అనవసరంగా విడగొడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి బూటకమన్నారు. గ్రామాల్లో బావులు, బస్తీలు వేర్వేరుగానే ఉన్నాయని, ఏనాడూ కలిసి లేరన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినప్పటికీ ప్రభుత్వ రిజర్వేషన్లు అందని కులాలు నేటికి అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేసి సీఎం రేవంత్రెడ్డి సర్కార్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముప్పై ఏండ్ల దండోరా పోరాట ఫలితంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. వర్గీకరణ లేకుండా జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాల్లో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్లో జరుపతలపెట్టిన ‘వెయ్యిగొంతులు-లక్ష డప్పులు’ మహా ప్రదర్శనకు మాదిగలు లక్షలాదిగా తరలిరావాలని పల్లె సంజీవయ్య, రమేశ్ కోరారు. కవులు, కళాకారులు, విద్యా వంతులు, నాయకులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రథయాత్ర నిర్వహిస్తామన్నారు. అనంతరం సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై డప్పులతో ప్రదర్శన నిర్వహించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డిపల్లి కృష్ణంరాజు, ఏర్పుల కృష్ణ, నాగులపల్లి శ్రీహరి, రచయితలు సొన్నాయిల బాలరాజు, అమృత్ బండారి, కోవూరి నర్సింహులు, నాయకులు ఎర్రోళ్ల రమేశ్, లింగం, గణపతి, ఏర్పుల రాజేందర్, శ్రీకాత్, శివకుమార్ పాల్గొన్నారు.