మెదక్, మే 22 (నమస్తే తెలంగాణ): కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్‌లోని దాయరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాయరలో కొనుగోలు ప్రక్రియ తుదిదశలో ఉన్నందున త్వరితగతిన కొనుగోళ్లు పూర్తిచేసి మిల్లుకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ఇప్పటివరకు 2,22,082.120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 51,309 రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.355. 45 కోట్లు చెల్లించామని చెప్పారు. 108 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అయిందన్నారు. జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 34 బైలేడ్ మిల్లులు, 31 రా మిల్లులకు ధాన్యం కేటాయించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు సిద్దిపేట జిల్లాకు 10,000 మెట్రక్ టన్నులు, మహబూబ్‌నగర్ జిల్లాకు 40,000 మెట్రక్ టన్నులు ధాన్యం పంపించామని చెప్పా రు. ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా 600కు పైగా లారీలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యంగింజనూ కొనుగోలు చేస్తామన్నారు. కలెక్టర్ వెంట పౌర సంబంధాల అధికారి బ్రహ్మారావు, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.