మెదక్ : తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామదాస్ ఆథవాలే (Ramdas Athavale ) అన్నారు. శనివారం మెదక్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమేనని , బీజేపేతర రాష్ట్రాలకు సైతం బడ్జెట్(Budget) లో నిధులు కేటాయించామని వెల్లడించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తమ పార్టీ పనిచేస్తుందని, నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ సామాజిక, ఆర్థిక న్యాయం దిశగా ఉందని కొనియాడారు. ముద్ర రుణాలను(Mudra Loans) రూ 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచి, ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండా అందజేస్తుందని వివరించారు.
ఉజ్వల యోజన పథకం ద్వారా ఇంటింటికి గ్యాస్, ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా పేదలకు 3 కోట్ల ఇల్లు నిర్మించి ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్కు రాజధాని లేకపోవడంతో ఎక్కువ నిధులు కేటాయించామని స్పష్టం చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చదువుకున్నది ఏడో తరగతి. చేసే పని గోడలకు వేసే సున్నం. కాబట్టి అలాంటి వాళ్లకు కేంద్ర బడ్జెట్ అర్థం కాదని విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం వచ్చినా, రాకున్నా తెలంగాణకి వచ్చే వాటా వస్తుందని పేర్కొన్నారు.