Collector Rahul Raj | మెదక్ రూరల్, ఆగస్టు 14 : ప్రకృతి విపత్తుల్లో ప్రజల రక్షణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ ఘన్పూర్ మండలం ధూప్ సింగ్ తండా, పోచారం డ్యామ్‌ను జిల్లా పాలన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. అప్రమత్తతే శ్రీరామరక్ష. సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో ధూప్ సింగ్ తండాలో నిర్మాణం చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి పనులు.. వర్షాబావ ప్రభావంతో ప్రస్తుతం ఆగిపోయిన పనులను ప్రారంభించి నిర్మాణం పూర్తిచేసే విధంగా
చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి నిర్మానుష్యంగా ఉందని.. ఎటువంటి ప్రతికూల ప్రభావ పరిస్థితులతో విపత్తుల సంభవించినా.. సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రవాహ ఉధృతి ఉన్నప్పుడు వాగులు, చెరువులు దాటడం
చేయరాదని భారీ కేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ యంత్రాంగంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ ఆర్అండ్బీ అధికారులు క్షేత్రస్థాయిలోనే
ఉంటూ పరిస్థితులను బేరీజు వేసుకొని.. సంసిద్ధతలో భాగంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 10 మంది సభ్యులతో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని, పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వర్షపాత నమోదును దృష్టిలో పెట్టుకుని వర్షాలు సాధారణ స్థాయికి వచ్చేవరకు యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ వివరించారు.
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసు యంత్రాంగం ప్రజలకు రక్షణ కల్పించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అధిక వర్షాలు వల్ల వాగులు చెరువులు ఉన్న దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని.. ఎవరిని కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా చూస్తున్నామన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామని వివరించారు.
అనంతరం పోచారం డ్యాం సందర్శించి నీటి ప్రవాహ ఉధృతి నీటిమట్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శివ నాగరాజ్, ఇరిగేషన్ ఏఈఈలు సుధీర్, వెంకటేశం, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, ఇతర పోలీసు అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.