పుల్కల్, జూలై 16 : సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం(నేడు) మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారు. సింగూరు నుంచి నీటిని విడుదల చేయకుండా రైతుకంట కన్నీళ్లు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కారు అంటూ ఈనెల 14న బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సోమవారం మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్రాజ్ని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది.
నేడు ఉదయం 8 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సింగూరు ఎడమ కాల్వల ద్వారా సాగుకు నీటిని విడుదల చేయనున్నారు. తద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. నీటి విడుదల తమ విజయంగా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు. సింగూరు జలాలు పుల్కల్, చౌటకూర్, అందోల్కు చేరుతాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సుమారు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక్క పంటకు కూడా నీటిని విడుదల చేయలేదు.వానకాలం, యాసంగి రెండు పంటలకు సాగు నీటిని విడుదల చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేడు సాగుకు జలాలు విడుదల చేస్తుండడంతో ధీమాగా పంటలు సాగుచేసుకుంటామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.