మెదక్, మార్చి 23(నమస్తే తెలంగాణ): ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి మట్టం భారీగా పడిపోతున్నది. ఎండలు పెరగడంతో గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో మెదక్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిపోతే ఈసారి 10.67 మీటర్లకు పడిపోయాయి. ఫిబ్రవరిలోనే అధిక మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సాగు, తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా వర్షపాతం లోపంతో, అధికంగా బోర్లు తవ్వడం, నీటి వినియోగంలో నియంత్రణ లేకపోవడంతో నీటి మట్టం దిగజారుతున్నది.
హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు, కల్యాణ మండపాలు, మాల్స్‌తో పాటు ఇతర వాణిజ్య సముదాయాల్లో బోర్లు వేసేందుకు భూగర్బ జల శాఖ అనుమతి తీసుకోవాలి. వ్యాపారులు మెదక్ జిల్లాలో ఇష్టారీతీలో బోర్లు వేస్తున్నారు. వ్యవసాయ, తాగునీటి అవసరాల కోసం నియంత్రణ లేకుండా బోర్లు వేయడం, చెట్లు నరికివేయడంతో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నది. చెరువులు, కుంటల్లో పూడిక నిండడంతో వర్షపు నీరు నిల్వ ఉండడంలేదు.
మెదక్ జిల్లాలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు భారీ నీటి ప్రాజెక్టులు లేకపోవడం, ఉన్న నీటి వనరులకు మరమ్మతులు చేయకపోవడంతో నీటి నిల్వ తగ్గిపోతున్నది. పలు గ్రామాల్లో బోర్లు ఎండిపోవడంతో రైతులు కొత్త బోర్లు వేయల్సిన దుస్థితి వచ్చింది. దీంతో రైతులకు ఖర్చులు పెరిగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో కొంతమంది రైతులు సాగు విస్తీర్ణం తగ్గించుకునే దుస్థితి వచ్చింది.
భూగర్భ జలాలు తగ్గదలకు ప్రధాన కారణం అధిక బోర్లు వేయడం, చెరువులపై నిర్లక్ష్యం, అడవుల తగ్గుదల, వర్షపు నీరు నిల్వ చేయకపోవడంతో నీటి కష్టాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయతో వర్షపు నీటి సంరక్షణ కొంత మేరకు ఉపయోగపడింది. చెరువులు, కుంటల పునరుద్ధరణ చేసి వర్షపు నీటిని నిల్వ చేశారు. హల్దీవాగుతో పాటు ఇతర వాగులో ఇసుక తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు భారీగా తగ్గిపోతున్నాయి. ఘనపూర్ ప్రాజెక్టులో నీరు లేక ఎండిపోయింది.
కాలువలు నీరు లేక ఎడారిగా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం జలాలు హల్దీవాగులోకి వదులడంతో వేసవిలో నీటితో కళకళలాడుతుంది. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కాల్వతో గోదావరి నీటిని హల్దీవాగులోకి వదులుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడంతో ప్రసుత్తం వేసవిలో హల్దీ వాగులో నీరు ప్రవహిస్తున్నది.
మెదక్ జిల్లాలో ఫిబ్రవరిలో భూగర్భ జలాల పరిస్థితి ఇలా ఉంది. అల్లాదురంలో 12.87 మీటర్లు లోతు కు భూగర్భ జలాలు పడిపోయాయి. చేగుంటలో 8.98 మీ, చిలిపిచెడ్‌లో 14.11 మీ, హవేళీఘనపూర్‌లో 8.67 మీ, కౌడిపల్లిలో 14.84 మీ, కొల్చారంలో 12.22 మీ, మనోహరాబాద్‌లో 8.04 మీ, మాసాయిపేటలో 17.09 మీ, మెదక్‌లో 10.92 మీ, నర్సాపూర్‌లో 16.64 మీ, నార్సింగి లో 25.46 మీ, నిజాంపేటలో 11.21 మీ, పాపన్నపేట 7.87 మీ, రామాయంపేటలో 13.11 మీ, రేగోడ్‌లో 12.08 మీ, పెద్దశంకరంపేటలో 10.43 మీ, చిన్నశంకరంపేటలో 12. 42 మీ, శివ్వంపేటలో 7.33 మీ, టేక్మాల్‌లో 9.57 మీ, తూప్రాన్‌లో 13.99 మీ, వెల్దుర్తిలో 9.48 మీ లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది.
నీటి వనరుల సంరక్షణలో ప్రజల పాత్ర చాలా కీలకం. వర్షపు నీటిని నిలువ చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. చెరువులు, కుంటలు నింపుకోవాలి. భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఫిబ్రవరిలో నీటిమట్టం తగ్గినట్లు సర్వేలో గుర్తించాం. వర్షపు నీటిని నిల్వ చేయడంతో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో నీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మెదక్ జిల్లాలో ఫిబ్రవరిలో సగటున 10.67 మీటర్లు లోతులో నీటిమట్టం ఉంది. వేసవి ఎండలు పెరిగిపోవడంతో నీటి మట్టం తగ్గిపోతుంది. వ్యవసాయ బావులు, బోర్లలో నీటితో కళకళలాడిన మెదక్ జిల్లా ఇప్పుడు ఎడారిగా మారుతున్నది. ఏటా భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు, ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిణామం భవిష్యత్తులో నీటి తీవ్ర సంక్షోభానికి సంకేతాలు ఇస్తోంది.
– పరమేశ్ గౌడ్, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి, మెదక్