మెదక్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడత పకడ్బందీగా అమలు చేయడంతోఎంతో మంది కి లబ్ధి చేకూరింది. రెండో విడతలో మరికొం త మందికి పంపిణీ చేసే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పంపిణీ నిలిచిపోయింది. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 20,182 మంది దరఖాస్తు చేసుకోగా, 12,997 మందికి గొర్రెల యూనిట్ల పంపిణీ చేశారు. రెండో విడతలో 7234 లక్ష్యం కాగా, 6774 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 2584 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించగా, 642 మంది లబ్ధిదారులకు మాత్రమే గొర్రెలు అందజేశారు. మిగతా 1942 మంది పెండింగ్లిస్ట్లో ఉన్నారు. ఒక యూనిట్ ధర రూ.1,75,000 ఉండగా, లబ్ధిదారుడి వాటా కింద 25 శాతం(రూ.43,750) చెల్లించాలి.
కులవృత్తులకు పునరుజ్జీవం పోయాలనే లక్ష్యంతో కేసీఆర్ సరార్ 2017లో గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీ కారం చుట్టింది. 75 శాతం రాయితీపై ఒకో యూనిట్ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేసింది. గతంలో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా, లబ్ధిదారుడి వాటా రూ.31,250, మిగతా రూ.93,750లను సబ్సిడీ కింద ప్రభుత్వమే చెల్లిచింది. అయితే, మెదక్ జిల్లాలో 2017 మే, జూన్ నెలల్లో ఒకే సారి మొదటి, రెండో విడత కోసం లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి విడత లక్ష్యం 20,182 కాగా, అధికారులు 12,997 యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో 7234 మందికి అందజేయాల్సి ఉండగా, కేవలం 642 మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు.
రెండో విడత వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా పూర్తి చేశారు. ప్రతి గ్రా మంలోని రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో సర్పంచ్, సొసైటీ ఇన్చార్జి, పంచాయతీ కార్యదర్శి, మండల పశువైద్యాధికారి, ఆ శాఖ ఏడీ విచారణ చేశారు. మొదటి విడతలో లబ్ధిదారుడి వాటాను డీడీ రూపంలో తీసుకోగా, ఆ తర్వాత ఆర్టీజీఎస్ విధానంలో లబ్ధిదారుడి ఖాతా నుంచి జమ చేశారు. వర్చువల్ పద్ధతిలో లబ్ధిదారుడికి ఐడీ ఇచ్చి, ఆ ఐడీకి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు.
ఈనెల 26 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గొర్రెల పంపిణీ కార్యక్రమ విధివిధానాలు (గైడ్ లైన్స్) రాకుంటే జిల్లాలో గొర్రెల కాపరుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమాన్ని చేపడుతామని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు వి.దేవరాజ్ హెచ్చరించారు. 2019లో రెండో విడతను ప్రారంభించగా, కొన్ని నెలల క్రితం గొర్రెల పంపిణీకి డీడీలు కట్టామని కానీ ఇంతవరకు గొర్రెల పంపిణీ లేదా నగదు బదిలీ చేయకపోవడం విచారకరమన్నారు.
రెండో విడతలో 7243 మంది లబ్ధిదారులకు గొర్రెలు అందించాలని లక్ష్యం కాగా, 6774 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2584 మంది డీడీలు చెల్లించారు. ఇందులో 642 మందికి గొర్రెలను పంపిణీ చేశాం. ఇంకా 1942 మందికి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మిగతావారికి కూడా పంపిణీ చేస్తాం.