హుస్నాబాద్, జనవరి 23: హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వార్థ పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని ఆయన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేవలం హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్లో కలిపితే, హన్మకొండ జిల్లాలో ఉన్న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను ఏం చేస్తారో చెప్పాలన్నారు.
విలీనం అంటూ ప్రజల మధ్య చిచ్చు పెడితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో హుస్నాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్కే పట్టం కడతారన్నారు. మున్సిపల్ పరిధిలోని 20వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందనే ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్ బల్దియాపై ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డు నుంచి మల్లెచెట్టు చౌరస్తా, మెయిన్‌రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, హన్మకొండ రోడ్డులో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ, ప్రతి దుకాణానికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చక పోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తప్పుడు కేసులు నమోదు చేసి, విచారణల పేరిట వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలపడుతుందే తప్ప వెనుకడుగు వేయదని వొడితెల సతీశ్ కుమార్ అన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.