హుస్నాబాద్‌టౌన్, ఏప్రిల్ 20: ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనలా తరలిరావాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్, అక్కన్నపేట, చిగురుమామిడి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమా వేశం ఆదివారం హుజురాబాద్‌లోని సింగాపూర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ నుంచి 50వేల మంది నాయకులు, కార్యకర్తలు తరలి రావాలన్నారు.
బైక్‌లు, ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు, బస్సులతో పాటు అందుబాటులో ఉన్న వాహనాల్లో ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగేసభకు అన్నివర్గాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విధంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయాలని ఆయన సూచించారు. రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు చైతన్యమైన హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి జనసైన్యం దండులా కదిలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 20: బీఆర్ఎస్ 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభకు మేము సైతం అంటూ సిద్దిపేట జిల్లా గట్లమల్యాల బీఆర్ఎస్ నాయకులు కూలిపని చేశారు. ఆదివారం గ్రామానికి చెందిన రైతులు బుద్ధి తిరుపతి, పుట్ట మధుకర్ పొలంలో వ్యవసాయ పనుల్లో వారు పాల్గొన్నారు.
ఇందుకు రైతులు బీఆర్ఎస్ నాయకులకు కూలిగా రూ.10వేలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రేణుకావేణుగోపాల్, బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రబాబు, నాయకులు వీర్యానాయక్, ప్రకాశ్‌రెడ్డి, వెంకటయ్య, శ్రీనివాస్, వెంకటేశ్, తిరుపతి, భిక్షపతి, పరశురాములు, రాజు, కోటయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
పుల్కల్, ఏప్రిల్ 20: సింగూరు ప్రాజెక్టు ద్వారా నీరందక పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పుల్కల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభవాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా రైతుబంధుకు దిక్కేలేదని, ఆరు గ్యారెంటీల ఊసేలేదన్నారు. మంత్రులు పాలన గాలికివదిలేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గులాబీపార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు కార్యకర్తలు ఎండగట్టాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుండగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌కు ఫోన్ చేయడంతో వెంటనే ఆసందేశాన్ని స్పీకర్ ఆన్‌చేసి వినిపించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు జైపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు మాచర్ల విజయ్‌కుమార్, నాయకులు నర్సింహారెడ్డి,యాదగిరిరెడ్డి,ఉపాధ్యక్షులు కిషన్‌గౌడ్, విష్ణయ్య, ప్రధాన కార్యదర్శి పడమటి రమేశ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌చారి, మహేశ్‌బాబు, మఠం సిద్ధన్న, లోకేశ్, కనకారెడ్డి, ఎర్రోళ్ల పోచయ్య పాల్గొన్నారు.
చిన్నకోడూర్, ఏప్రిల్ 20: రంగనాయకసాగర్ రిజర్వాయర్ నిర్మించిన కేసీఆర్, హరీశ్‌రావు పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొండెంగలకుంట గ్రామ శివారులోని కుమ్మరికుంట, చెక్‌డ్యామ్ నిండడంతో మాజీ సర్పంచ్ ఎల్లయ్య ఆధ్వర్యంలో కేసీఆర్, హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల్లో చెక్‌డ్యామ్ మత్తడిపారడం సంతోషంగా ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పేరోజులు దగ్గర పడ్డాయన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సొంత నిధులతో కాల్వ పనులు పూర్తి చేయించినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సహకారంతో మాచాపూర్ నుంచి ఎల్లాయపల్లి,కొత్తపల్లి, అల్లిపూర్ గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలని, భూ సమస్యలను ఇరిగేషన్ అధికారులు పరిషరించాలని డిమాండ్ చేశారు. మండలంలో ఎటు చూసినా పచ్చని పం ట పొలాలు కనిపిస్తున్నాయన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసినందుకు కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భూమారెడ్డి, మాజీ సర్పంచ్ మొండయ్య, నాయకులు రాజు, దేవయ్య, హనుమయ్య పాల్గొన్నారు.