నర్సాపూర్, ఫిబ్రవరి 22: అర్బన్ పార్కు సమీపంలో కాటేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సుడిగాలి పర్యటన చేస్తూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా 252 హెక్టార్లలో ఏర్పాటు చేసిన నర్సాపూర్ అర్బన్ పార్కును సందర్శించి, వాచ్‌టవర్ ఎక్కి అందాలను పరిశీలించి కాటేజీ నిర్మాణాలను మార్చి నాటికి పూర్తిచేసి, పర్యటకులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ రాజర్షి షా అటవీశాఖ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. హైదరాబాద్‌కు సమీపంలోని ఈ పార్కును పర్యాటకులు ఆకర్షించే విధంగా సౌకర్యాలు కల్పిస్తే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. పార్కులో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న 7 కాటేజీలు, డైనింగ్‌హాల్స్, కిచెన్ షెడ్, రిసెప్షన్ కౌంటర్ వంటి పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో చేయాలన్నారు. కాటేజీల సమీపంలో నుంచి బోటులో షికారు చేసేలా బోటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, చక్కటి పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్, యోగా, మెడిటేషన్, స్విమ్మింగ్ వంటి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని డీఎఫ్‌వోకు సూచించారు.
రూ.90 లక్షలతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. నిర్మాణంలో మిగిలిపోయిన పనులను మార్చి నెలాఖరుకు పూర్తిచేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, అవసరమైన రూ.10 లక్షల నిధులను గ్రంథాలయ సెస్ నుంచి అందించవలసినదిగా మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. రూ.4 కోట్లతో నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించి మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచుకొని, పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ ఏరియా దవాఖానను కలెక్టర్ సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతిరోజు 500 మందికి పైగా ఔట్ పేషెంట్లను పరీక్షిస్తుండడం, ప్రసూతి వార్డులోని 20 బెడ్స్ ఎప్పుడూ ఫుల్‌గా ఉండడం, నెలకు 120కు పైగా కాన్పులు చేస్తుండడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇవ్వాలని, బిడ్డ పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్ అందించాలని వైద్యాధికారులకు సూచించారు. స్కానింగ్, అంబులెన్స్ వంటి సమస్యలను అధిగమించాలని దవాఖాన సూపరింటెండెంట్ మిర్జా నజీమ్బేగ్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్‌తో అన్నారు. అనంతరం మెదక్ రోడ్డు నర్సాపూర్ శివారులో తాత్కాలికంగా చెత్తను డంప్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి ఆ చెత్తను బయో మైనింగ్ చేసి తొలగించాలని, ఇక నుంచి వెల్దుర్తి మార్గంలోని డంపింగ్ యార్డుకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో చెత్త వేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జిల్లా అటవీశాఖ అధికారి రవి ప్రసాద్, ఎఫ్ఆర్వో అంబర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, పీఆర్‌ఈఈ సత్యనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.