గుమ్మడిదల, జూలై 16: కాంగ్రెస్ కౌన్సిలర్లపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు, స్థానిక యువకులు తిరగబడ్డారు. అభివృద్ధిని గాలికోదిలేసి తీర్థయాత్రలు చేసిన కౌన్సిలర్లపై పట్టణప్రజలతో పాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు తిరగబడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెటిరో సంస్థపై తప్పుడు సంకేతాలతో ప్రజల్లో అనిశ్చితి వాతావరణం నెలకొల్పుతున్న ఆయా పార్టీల కౌన్సిలర్లపై ఆగ్రామస్తులు తిరగబడి సరైన సమాధానం చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మున్సిపాలిటీలో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన ఇద్దరు, బీఆర్ఎస్కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఈనెల10వతేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశానికి గైర్హాజయ్యారు.
ఈ విషయాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఆ 13 మంది కౌన్సిలర్లు చైర్మన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో వారిపై వ్యతిరేకంగా వ్యక్తమవుతుండటంతో దానిని సరిదిద్దుకోవటానికి అన్నారంలోని సర్వేనంబర్ 261 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని కమిషనర్ దశరథ్, తహసీల్దార్ పరమేశానికి వినతి పత్రాలు ఇచ్చారు. తిరిగి మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. రెండు రోజుల క్రితం కమిషనర్‌ను వెంటబెట్టుకుని కొన్ని అక్రమ నిర్మాణాలు తొలిగించారు. గురువారం కమిషనర్‌ను వెంటబెట్టుకుని సర్వే నంబర్ 261 ప్రభుత ్వభూమిలో ఉన్న నిర్మాణాలను తొలిగించడానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుట్ట నర్సింగ్‌రావు, సీనియర్ నాయకులు మద్ది ప్రతాప్‌రెడ్డి, వీరారెడ్డి పార్టీ శ్రేణులతో క్షేత్రస్థాయికి వెళ్లారు.
అక్కడ మున్సిలిటీకి చెందిన మూడు పార్టీల కౌన్సిలర్లు నిర్మాణాలు తొలిగించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి అన్ని రకాల అభివృద్ధికి దోహదపడుతున్న హెటిరో సంస్థను అవమాన పర్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీల నాయకులతో కమిషనర్ తిరుగుముఖం పట్టారు. స్వలాభంకోసం ప్రజా సమస్యలను గాలికొదిలేసి కుతంత్రాలు చేస్తున్న కౌన్సిలర్లకు గుణపాఠం చెబుతామని ప్రజలు హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్‌తో పాటు మరి కొంతమంది వీరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చైర్మన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.