సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 13: ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల విలీన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏప్రిల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కాలం డిమాండ్లలో మూడు అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా పరిగణించిందన్నారు.
ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశాలు ఉన్నాయని వివరించారు. మిగతా డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తీసుకొచ్చి విలీన ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా ప్రభుత్వం పరిగణించిందన్నారు. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.