సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 5 : కాళేశ్వరం ప్రాజెక్ట్ తోనే సిద్దిపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు వీక్షించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా, శ్రద్ధ్దతో వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం చేపట్టాకనే రైతులకు సాగునీరు వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అర్హులైన వారికి 11 రకాల పింఛన్లు పెంచి ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
ఆరుగ్యారెంటీలు, హామీలు బోగస్ అయినట్లు విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సంఘటితమై అన్ని స్థానాలు గెలుపొందాలన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, కేసీఆర్ కుటుంబంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ,ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పీడ పోతుందా అని ప్రతి నలుగురు చర్చిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడిన ప్రతిసారి కేసీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో భూముల ధరలు పెరిగితే, కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు పడిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని అబద్ధ్దాలు మాట్లాడారని, హరీశ్‌రావు ప్రజంటేషన్ తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ తెలిసిందన్నారు.
కేసీఆర్ ఎంతో కష్టపడి ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టిలో కలిపేస్తామన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు గౌరవెల్లి ప్రాజెక్ట్ నుంచి ఒక్క ఎకరానికి నీరు అందించలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.