మెదక్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, రాష్ట్ర జాయింట్ ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి సాధారణ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి సమీకృత కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల ధ్రువీకరణ, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ టర్నవుట్ పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
అనంతరం అధికారులతో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల జాబితా వివరాలను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రతి మండలంలోని తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకుని ధ్రువీకరించాలని ఈఆర్వోలకు ఆదేశించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, డెత్, షిఫ్ట్ అయిన ఓటర్లు లేకుండా బూత్ స్థాయి అధికారి ధృవీకరించాలని, ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని కలెక్టర్ పేరొన్నారు. జిల్లాలోని బూత్ స్థాయి అధికారుల జాబితా వివరాలు రాజకీయ పార్టీలకు అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలు సమర్పించాల్సిందిగా రాజకీయ పార్టీలకు సూచించాలన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రించి అందించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా జనాభా ఓటర్ల నిష్పత్తి, లింగ నిష్పత్తి, ఓటర్లలో యువ ఓటర్ల నమోదుపై దృష్టి సారించి, వారి నిష్పత్తిపై సమాచారం అందించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర జనాభా, ఓటర్ నిష్పత్తి, లింగ నిష్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు అంబాదాస్ రాజేశ్వర్, శ్రీనివాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.