చిన్నకోడూరు, ఆగస్టు 13: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే రహదారులను దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం చిన్నకోడూరులో తహసీల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు అల్లిపూర్ సొసైటీ కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు అకడికి చేరుకుని మద్దతుగా నిలిచారు.
సీఎం రేవంత్ రెడ్డి యూరియా కొరత లేదని అనడం సిగ్గుచేటు అని రాధాకృష్ణ శర్మ అన్నారు. చిన్నకోడూరులోని అల్లిపూర్ సొసైటీ వద్దకు వచ్చి చూస్తే యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతుల బాధలు కనిపిస్తాయని మండిపడ్డారు. ఒకో రైతుకు రెండు యూరియా బస్తాల నిబంధన ఎత్తివేసి, సరిపడా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి రైతులను నిండా ముంచిందన్నారు.
కాంగ్రెస్ అసమర్ధతతోనే యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు సదానందం గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ నాయకులు మేడికాయల వెంకటేశం, ఏమి రెడ్డి భూమిరెడ్డి, ఇట్టబోయిన శ్రీనివాస్, జంగిటి శ్రీనివాస్, కొండం రవీందర్ రెడ్డి, ఉమేశ్‌చంద్ర, కుంటయ్య, ఎల్లయ్య,గుండెల్ని వేణు, గుజ్జ రాజు, రఘు వర్మ, రాజశేఖర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
గజ్వేల్, ఆగస్టు 13: కొద్ది రోజులుగా యూరియా దొరక్కపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని పీఏసీఎస్ గేట్‌కు ‘యూరియా నో స్టాక్’ బోర్డును అధికారులు ఏర్పాటు చేయగా, రైతులు ఆందోళన చెందారు. తెల్లవారుజామునే వచ్చిన రైతులు పీఏసీఎస్ వద్ద క్యూలో నిలబడ్డారు. తీరా అధికారులు వచ్చి యూరియా నో స్టాక్ బోర్డును ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కల్యాణ్కర్ నర్సింగరావు మద్దతు తెలిపారు.