గజ్వేల్, నవంబర్ 24: వినియోగదారులకు కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం, చేపలు ఒకేచోట దొరికేలా సమీకృత మార్కెట్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మించారు. గజ్వేల్‌లో సమీకృత మార్కెట్‌ను సకల హంగులతో నిర్మించి నాలుగేండ్ల క్రితం వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ వ్యాపారులు రోజూ రోడ్లపైనే అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్లో అమ్ముకునే వారికి గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తా నుంచి ఢిల్లీవాలా హోటల్ వరకు ట్రాఫిక్ సమస్యతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాఫిక్ సమస్యను మార్కెట్, మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వదిలేయడంతో సమస్య జఠిలమవుతుందని పట్టణవాసులు వాపోతున్నారు. ఢిల్లీవాలా హోటల్ వరకు రోజూ రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు, పండ్ల అమ్మకాలతో దుకాణాదారులకూ సమస్యగా మారింది. రోడ్లపైనే అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్లోకి వినియోగదారులు తక్కువ సంఖ్యలో రావడంతో గిరాకీలు లేక చాలామంది వ్యాపారులు అమ్మకాలకు దూరంగా ఉంటున్నారు. సకల వసతులతో నిర్మించిన సమీకృత మార్కెట్లోనే వ్యాపారులు అమ్మకాలు జరిపేలా చూడాలని విక్రయదారులు కోరుతున్నారు. అన్ని శాఖల అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కారించాలని కోరుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో గజ్వేల్ పట్టణంలో సమీకృత మార్కెట్‌ను రూ. 22.85 కోట్లతో 6ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. ఇందులో 246 స్టాల్స్ ఉండగా అందులో 52 స్టాళ్లు మాంసం, చేపల విక్రయానికి, 111 స్టాళ్లు కూరగాయలు, 83 స్టాళ్లు పూలు, పండ్ల విక్రయానికి కేటాయించారు.
మార్కెట్‌ను ప్రారంభించిన తరువాత ఇక్కడ రోజుకు 10క్వింటాళ్ల కూరగాయలు, మూడు క్వింటాళ్ల పూలు, 2 క్వింటాళ్ల పండ్లు అమ్ముడుపోయేవి. ఈ సమీకృత మార్కెట్ నిర్వహణ బాగుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు లభించింది. రోడ్ల పక్కన కూరగాయలు, పండ్ల అమ్మకాలు కొనసాగుతుండడంతో సగానికి పైగా స్టాళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఏర్పాటైన కొత్త పాలకమండలి సమీకృత మార్కెట్‌పై దృష్టి సారించి సమస్యలను పరిష్కారించాలని వ్యాపారులు కోరుతున్నారు.
రోడ్లపైన కూరగాయలు, పండ్ల అమ్మకాలు లేకుండా చూస్తాం. ఇప్పటికే రోడ్ల పక్కన అమ్ముకునే వారికి అవగాహన కల్పించి మార్కెట్లోపల అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్ సిబ్బంది రోడ్లపై పర్యవేక్షణ చేస్తున్నారు.
– జాన్‌వెస్లీ, మార్కెట్ కార్యదర్శి