చేర్యాల, సెప్టెంబర్ 13 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రజలతో పాటు చేర్యాల ప్రాంత ప్రజలకు అన్నీ ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ హయాంలో పట్టణంలో వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. చేర్యాలలోని అంగడి బజారులో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు రూ.3కోట్లు మంజూరు చేసింది. రూ.3కోట్ల నిధుల్లో రూ.2కోట్లు సర్కారు నిధులు, మరో రూ.కోటి మున్సిపల్ సాధారణ నిధులను ఉపయోగించుకోవాలని జీవో జారీ చేసింది.పట్టణంలో చేపట్టిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. అనేక కారణాలతో పనులు తీవ్ర జాప్యం అవుతున్నాయి.
దీంతో పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వారంతపు అంగడి కొనసాగే ప్రదేశంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టడంతో నాలుగేండ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మంగళవారం కొనసాగే అంగడి జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్నది.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు సైతం ప్రజలకు ఉపయోగపడే వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పూర్తి చేయించేందుకు ఎలాంటి చొరవ చూపడం లేదు.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మించేందుకు ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం మంజూరు చేసిన నిధులతో ప్రారంభించిన పనులు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. మొదటగా స్థల సేకరణలో మున్సిపల్ పాలకవర్గం, స్థానిక నేతల జోక్యంతో నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. స్థలాన్ని ఎంపిక చేయడం కోసమే సంవత్సరం పట్టింది.అనంతరం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కేవలం పెద్దపాటి రేకులషెడ్ నిర్మించి దానికి షెటర్లు బిగించి వదిలిపెట్టాడు.
రెండు ఎకరాల స్థలం కావాల్సి ఉండగా అందరికీ అందుబాటులో ఉంటుందని అంగడి కొనసాగే ప్రదేశంలో నిర్మాణ పను లు ప్రారంభించారు.సరిపడా స్థలం లేక పాత గ్రామ పంచాయతీ భవనం(మున్సిపల్‌గా అవతరించిన తర్వాత మొదటి కార్యాలయం) సైతం తొలగించి ఆ ప్రదేశంలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు.పనులు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కేవలం గోదాం తలపించే విధంగా రేకుల షెడ్ నిర్మించి వదిలిపెట్టారు.ఇందులో నాన్‌వెజ్ మార్కెట్ కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేశారు.
స్థానికంగా ఉన్న అధికారులు శ్రద్ధ వహించకపోవడం, నాన్‌వెజ్ వ్యాపారం కొనసాగించే వ్యక్తులు సైతం అందులోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ప్రస్తుతానికి గోదాంలాగా ఉన్న షెడ్ కాస్తా నిరుపయోగంగా మారిం ది.వెజ్,నాన్‌వెజ్ నిర్మాణ పనులను పూర్తి చేస్తే చేర్యాల పట్టణ ప్రజలతోపాటు కొమురవెల్లి,మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజలకు సైతం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే మొదటగా నిర్మాణ పనులు పూర్త్తయిన నాన్, వెజ్ షెడ్‌ను ప్రారంభించి అనంతరం వెజ్ షెడ్ పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.