ములుగు, ఆగస్టు 8 : వ్యవసాయ, ఉద్యాన రంగాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి దండా రాజిరెడ్డి అన్నారు. ములుగులోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘తెలంగాణ ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక – 2035’ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్‌కు అందించారు. అనంతరం హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో సాంకేతిక సహకారానికి వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకొని ఎంవోయూలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ… డిజిటల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు సాంకేతికతను చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నా రు. నాబార్డు సహకారంతో ఉద్యాన రంగ పరిశోధనలను మరింత విస్తరిస్తామని తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, ఐసీఏఆర్ డైరెక్టర్ షేక్ మీరా, వర్సిటీ అధికారులు సురేశ్‌కుమార్, నందిని, సతీశ్ పాల్గొన్నారు.