వర్గల్ జూలై 30: నీళ్లు..నిధులు…నియామకాలే మూలసూత్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని వర్గల్ మండలం ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా ఎదుగుతున్నది. గజ్వేల్ నియోజకర్గంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీకి మొదటి ఫేజ్‌లో బీజం పడింది. ప్రముఖ పాలఉత్పత్తుల సంస్థ అయిన అమూల్ డెయిరీమిల్క్ సంస్థతో పాటు ఫుడ్‌ప్రాసెస్ సిస్టమ్‌లో మరో 5 కంపెనీలు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమ స్థాపన కోసం మొత్తం 12 వందల ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. ఉన్నత చదువులు చదివి.. ఉపాధి కోసం పడరానిపాట్లు పడుతున్న యువతకు ఈ పరిశ్రమల స్థాపనతో కొలువుల కల నెరవేరనుంది. నిరుద్యోగ యువత పరిశ్రమల కంపెనీల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
వర్గల్ మండల కేంద్రంలోని అవుసులోనిపల్లి, నగరంతండా, వర్గల్ శివారు భూములైన 1510, 1209, 1248, 182, 845, 166 తదితర ప్రభుత్వ అసైన్డ్ సర్వే నంబర్లలో అమూల్ డెయిరీ మిల్క్ కంపెనీతో పాటు ఇతర కంపెనీల స్థాపన కోసం ఇప్పటికే వేయి ఎకరాల భూసేకరణ పూర్తిచేసినట్లు వర్గల్ తహసీల్దార్ సతీశ్‌కుమార్ తెలిపారు. వర్గల్ మండల పరిధిలోని 1000 ఎకరాలు, ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులోని మరో 200 ఎకరాలు కలుపుకొని మొత్తం 12వందల ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో అమూల్ డెయిరీమిల్క్ ప్లాంట్‌తో పాటు ఇతర ఫుడ్‌ప్రాసెస్ కంపెనీల కోసం రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ భూముల్లో విశాలమైన రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి.
ఫుడ్ ప్రాసెస్ కంపెనీల స్థాపనలో భాగంగా టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో సేకరించిన ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో మౌలిక వసతుల కల్పనకు తొలివిడతలో రూ.300 కోట్లు, మలివిడతలో రూ.200కోట్లు కేటాయించినట్లు మండల రెవెన్యూ అధికారి సతీశ్‌కుమార్ తెలిపారు. 2024 చివరి నాటికి అమూల్ డెయిరీమిల్క్ ప్లాంట్ పనులతో పాటు ఇతర కంపెనీల పనులు కూడా పూర్తయి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
రాజధానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్గల్‌కు ఆహార ఉత్పత్తుల కేంద్రం రావడం నిజంగా ఇక్కడి ప్రాంత నిరుద్యోగులు చేసుకున్న అదృష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలితమే మా ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. కొండపోచమ్మ ప్రాజెక్టు ఏర్పాటుతో నీళ్లొచ్చాయ్..అభివృద్ధి పనులకు నిధులొచ్చాయ్.. ఇప్పుడు కంపెనీల ఏర్పాటుతో నియామకాలు జరుగుతాయి. కేసీఆర్ సారు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తమ ప్రాంత నిరుద్యోగ యువతకు
– దేవగణిక నాగరాజు, బీఆర్ఎస్ సీనియర్ నేత వర్గల్ మండలం
భూనిర్వాసితులందరికీ ఇండ్ల పట్టాలిచ్చాం ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ఏర్పాటులోభాగంగా భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.10లక్షలతోపాటు అర ఎకరాలోపు ఉన్నవారికి 121 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ భూమి కోల్పోయిన వారికి 250 చదరపు గజాలు ఇంటి నిర్మాణాల కోసం పట్టాలిచ్చాం. రెవెన్యూ అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగింది. ఫుడ్ ప్రాసెస్‌లో భాగంగా వర్గల్ మండలంలోని భూములు కోల్పోయిన గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతకు కంపెనీల్లో ప్రాధాన్యత ఉండేలా సీఎం దృష్టికి, మంత్రి హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్తాం.
రోజుకు 5లక్షల లీటర్ల పాలఆధారిత ఆహార ఉత్పత్తులు అమూల్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీరు, స్వీట్స్, లస్సీ, బ్రెడ్, బిస్కెట్స్ తదితర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీలో పరోక్షంగా 500 మంది, ప్రత్యక్షంగా 500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నట్లు తహసీల్దార్ సతీశ్‌కుమార్ తెలిపారు.
వర్గల్ మండలంలో పారిశ్రామికవాడలు నెలకొల్పడంతో వర్గల్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆయా గ్రామాల నిరుద్యోగ యువత కంపెనీల ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు రానుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై భరోసా పెంచుకుంటున్నారు. తమకు కొలువులిచ్చే దేవుడు ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
చేస్తున్నారు.