గజ్వేల్, మార్చి 22: అధికారంలో ఉండి గజ్వేల్‌ను అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్రకు శనివారం గజ్వేల్ మండలం కొడకండ్ల, శ్రీగిరిపల్లి రింగ్‌రోడ్డు వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే కనీసం రైతులకు వాటి ద్వారా సాగునీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
గోదావరి గోస పాదయాత్రపై రాష్ట్రంలోని రైతులు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు చేపడుతున్న పాదయాత్ర వారి పదవులను కాపాడుకోవడానికే తప్పా ప్రజల కోసం కాదన్నారు. గజ్వేల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను విమర్శించే అర్హత గజ్వేల్ కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. దమ్ముంటే గజ్వేల్‌ను మరింతగా అభివృద్ధి చేసి చూపాలన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, గుంటుక రాజు, రాజిరెడ్డి, గొడుగు స్వామి పాల్గొన్నారు.