గజ్వేల్, మే 26: ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ఎదుట బుధవారం రైతులతో కలిసి రైతుదీక్ష నిర్వహించబోతున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పక్షాన ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా కనువిప్పు కలగడం లేదన్నారు. అందుకు రైతుల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందన్నారు.
వానకాలం సమీపిస్తున్నా కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో రోడ్లపైనే ధాన్యం రాశులు ఉన్నాయని, వాటికి కాపలాగా రైతులు కుటుంబాలతో రాత్రింబవళ్లు గడుపతున్నారని తెలిపారు. కేసీఆర్ చేయూతతో రాష్ట్రంలో వరి సాగు పెరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు వడ్ల కొనుగోలు చేతకావడం లేదని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం సేకరణలో విఫలమైనట్లు ఆయన విమర్శించారు. కొనుగోళ్లలో జాప్యంపై అధికారులను ప్రశ్నిస్తే గన్నీ బ్యాగులు, హమాలీలు, నిల్వ చేసేందుకు గోదాంలు, లారీల సమస్యలను తెలుపుతున్నారు తప్పా ఎక్కడా రైతుల కోసం ఆలోచించడం లేదన్నారు.
బీజేపీ నాయకులు ముసలి కన్నీరుకారుస్తూ రాష్ట్రంలో పర్యటించడం విడ్డూరంగా ఉందని, బాధ్యత ఉన్నవారే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కుటుంబం ల్యాండ్ గ్రాబింగ్‌కు పాల్పడుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలను ఎవరూ పట్టించుకొవడం లేదన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు జుబేర్‌పాషా, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, శేఖర్, నాయకులు నర్సింగరావు, సుధాకర్‌రెడ్డి, రామచంద్రం, ఇంద్రసేనారెడ్డి, అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అర్జున్‌గౌడ్ పాల్గొన్నారు.