మెదక్, జులై 9 (నమస్తే తెలంగాణ) : మెదక్ మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లి చెట్ల గౌరారం గ్రామాల పరిధిలో ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ విస్తరణ పనులు వెంటనే నిలిపివేయాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రంగాయిపల్లి చెట్ల గౌరారం గ్రామాల పరిధిలో ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ ముందు గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ వల్ల గంత కొంతకాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం కంపెనీ విస్తరణ చేపట్టాలని ప్రయత్నిస్తుందని వెంటనే పనులు నిలిపి వేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ నుండి వెలబడుతున్న కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని శ్వాసకోశ సమస్యలు చర్మ సంబంధ వ్యాధులు గుండె జబ్బులు పెరిగిపో తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ వల్ల ఏర్పడుతున్న గాలి ధూళి భూగర్భ జలాల కలుషితంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యంతో వ్యవసాయ భూములు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
కంపెనీ ప్రభావంతో రంగాయిపల్లి చెట్ల గౌరారం పరిసర ప్రాంతాలలో దాదాపు నాలుగు గ్రామాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వేలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం కంపెనీ విస్తరణకు అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా చేశారు. కంపెనీ విస్తరణ కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ స్వీకరణ ఏకపక్షంగా చేశారని ఆరోపించారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ప్రజలకు ఇబ్బందుల గురి చేశారన్నారు.
ప్రజలకు భయాందోళన కలిగించి ప్రజాభిప్రాయ సేకరణ చేశారని ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందన్నారు. కంపెనీ విస్తరణకు సంబంధించి రెండుసార్లు ప్రజాసేవ సేకరణ నిర్వహించారని ప్రజలందరూ ఏకగ్రీవంగా కంపెనీ విస్తరణను వ్యతిరేకించాలని తెలిపారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న కంపెనీ విస్తరణ కోసం మరోసారి అభిప్రాయ సేకరణ చేయడం తగదన్నారు. ఈ ఆందోళనలో గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.